హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్ర ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో చేపట్టిన బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వ వైద్య సంస్థల్లో మానవ వనరుల సమతుల్యతను కాపాడుతూ ప్రభుత్వం 157 కేడర్లలో మొత్తం 4,869 మంది ఉద్యోగులను బదిలీ చేసింది. ఈ బదిలీల్లో అత్యధికంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో 2,258మంది బదిలీ అయ్యారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని పునర్వ్యవస్థీకరించారు. త్వరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎనఎంసీ) తనిఖీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఎనఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి మెడికల్ కాలేజీలో అవసరమైన సంఖ్యలో అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా బదిలీలను నిర్వహించింది. అదే సమయంలో ఒకే హాస్పిటల్ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఒకేసారి బదిలీ చేస్తే రోగులకు అందే సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని గుర్తించి బదిలీల ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా అమలు చేసింది. ఒకే స్టేషన్‌లో నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే బదిలీకి అవకాశం కల్పించింది. అంతకు తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు బదిలీల అవకాశం కల్పిస్తే జిల్లాల్లోని హాస్పిటల్స్‌లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ ్యశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రస్తుతం జిల్లాల స్థాయిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను, జిల్లా కేంద్రాల్లోని టీచింగ్ హాస్పిటళ్లను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. దాదాపు 90 శాతం వైద్య సేవలను జిల్లాస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు, మానవ వనరులను పెంచుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఇటీవల నియామకాలు పొందుతున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కూడా గ్రామీణ, జిల్లాస్థాయి వైద్య సంస్థల్లోనే పోస్టింగులు ఇస్తోంది. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు రవాణా, ఇతర ఖర్చుల భారం ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోనే అవసరమైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా, వైద్య సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించడం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసిందని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. బదిలీల్లో దీర్ఘకాలం హైదరాబాద్ వంటి ఒకేచోట పనిచేసిన వారిని బదిలీ చేయడంతో జిల్లాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన డాక్టర్లు, సిబ్బందికి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం దక్కింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


