– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : కోల్ గ్యాసిఫికేషన్ అనేది గొప్ప వ్యాపార అవకాశంతోపాటు మన దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గత నెల 28న దిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్ తొలి రోడ్ షో నిర్వహించగా రెండో రోడ్ షోను హైదరాబాద్‌లో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆ తర్వాతి రోడ్ షో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరుగుతుందని తెలిపారు. గురువారం ఇక్కడ జరిగిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ రోడ్ షో కోల్ గ్యాసిఫికేషన్ ప్రయాణానికి ఒక మూలాధారం అని చెప్పొచ్చునన్నారు. ఇక్కడి బీహెచఈఎల్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీతోపాటు అనేక పరిశోధనా సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని తెలిపారు. తెలంగాణలో సింగరేణి వద్ద అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులకు ఫార్మా రాజధాని అయిన హైదరాబాద్ అద్భుతమైన మార్కెట్ అని వివరించారు. మన బొగ్గు వనరులను వికసిత్ భారత్ నిర్మాణానికి కొత్త పునాదులుగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోందని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం దాదాపు రూ.46 వేల కోట్ల భారీ పథకాన్ని ప్రకటించిందని, ఇటీవల ఆమోదం పొందిన రూ.37,500 కోట్ల కోల్ గ్యాసిఫికేషన్ స్కీం కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని వివరించారు. తద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్ కు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నెల రోజుల లోపే ఈ రోడ్ షోను నిర్వహించుకుంటున్నామన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఎరువులు, రసాయనాలు, హైడ్రోజన్, శుద్ధమైన ఇంధనం ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, స్టీలు ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. డీజిల్,పెట్రోల్, జెట్ ఫుయెల్ వంటివాటి ఉత్పత్తిలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు. ప్రపంచస్థాయి కోల్ గ్యాసిఫికేషన్ పరిశ్రమను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన బొగ్గు నిల్వలు, పాలసీ మద్దతు, రాజకీయంగా నిబద్ధత ఉన్నాయన్నారు. బొగ్గు రంగానికి సంబంధించిన సంస్కరణల వల్ల లీకేజీలు, నకిలీ లబ్దిదారులను తొలగించడం ద్వారా రూ.4.3 లక్షల కోట్లకుపైగా దేశ సంపదను కాపాడగలిగామన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ అనేది బొగ్గు రంగానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదు.. వికసిత భారత్, ఆత్మ నిర్భర్ భారత్, అంతర్జాతీయంగా ఉత్పత్తి, పారిశ్రామికరంగాల్లో భారత్ మహోన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమయ్యే మూల స్తంభం అని చెప్పొచ్చునని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




