– ఓటర్ల జాబితా సవరణపై బీఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమం
– ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 12: కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్ హాల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ) అవగాహన సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, గోపిశెట్టి రాఘవేందర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ సావత్ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించారని, తెలంగాణలో కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఏలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తే సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడం సులభమవుతుందన్నారు. మీనాక్షి నటరాజన్‌కు సంబంధించిన ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆమె నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించారని ఆరోపించారు. బీఎల్‌ఏలకు ఉన్న శక్తి మరెవరికీ లేదని, ప్రతి ఓటరును గుర్తించి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.నేతన్నల సంక్షేమం కోసం ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతో పాటు ఇందిరమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. సిరిసిల్ల కలెక్టర్ చౌరస్తాలో నేతన్నల గౌరవార్థం ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 25 హెచ్‌పీ లోపు విద్యుత్ వినియోగించే నేతన్నలకు సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్‌పీడీసీఎల్‌కు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి అమలు దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నేతన్నల భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఇచ్చే ప్రతి పిలుపును కార్యకర్తలు పాటించాలని, రానున్న ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేలా కృషి చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



