‘బుర్జీల’ ప్రతినిధులను కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి

– రోడ్డు ప్రమాద బాధితులకు భారీ సహాయం
– డా. షంషీర్ ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన ఎమ్మెల్యే

చొప్పదండి, ప్రజాతంత్ర, జూన్ 12 : దుబాయిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురు కార్మికులు, గాయపడిన తొమ్మిదిమందికి 10 లక్షల దిర్హంలు (రూ.2.60 కోట్లు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించిన యూఏఈకి చెందిన బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ డాక్టర్ షంషీర్ వయలిల్‌కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృత్ఞఙతలు తెలిపారు. షంషీర్ వయలిల్ అందుబాటులో లేనందున ఆయన కంపెనీ ప్రతినిధులు ఎ.విజయ కుమార్, అహ్మద్ బిన్ సులేమాన్, ఎం.ఉన్నికృష్ణన్, డాక్టర్ పంకజ్ కుమార్ భట్‌లను శుక్రవారం దుబాయిలో ఎమ్మెల్యే మేడిపల్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్ కొట్టాల సత్యం గౌడ్, దుబాయిలోని తెలంగాణ సామాజిక కార్యకర్తలు జువ్వాడి శ్రీనివాస రావు, శామ్యూల్ దామెర, సలావుద్దీన్, ఎస్వి రెడ్డి, ద్యాగతి మహిపాల్ యాదవ్, సుతారి సత్యనారాయణ, కోరెపు మల్లేష్, ఎమ్మెల్యే పీఏ ముత్యం శంకర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం వయలిల్ సహా ‘బుర్జీల’ ప్రతినిధులను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. సీఎం ఎ.రేవంత్ రెడ్డి సమక్షంలో మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేద్దామని ప్రతిపాదించారు. ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురిలో ముగ్గురు జగిత్యాల జిల్లాకు చెందిన వారున్నారు. ఒక్కొక్కరికి లక్ష దిర్హంలు (రూ.26 లక్షలు) చొప్పున ఆర్ధిక సహాయం అందనున్నది. గాయపడిన తొమ్మిదిమందికి వైద్య చికిత్స, పునరావాసం, ప్రభావిత కుటుంబాల పిల్లల విద్య కోసం కూడా సహాయం చేస్తారు. అంతకుముందు రోజు ఎమ్మెల్యే దుబాయిలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించి కాన్సులేట్ అధికారులను కలుసుకున్నారు. మృతదేహాల తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని రాషేద్ హాస్పిటల్‌లో పరామర్శించారు. ఎమ్మెల్యే పర్యటనను దుబాయిలోని సామాజిక కార్యకర్తలు గుండెల్లి నర్సింలు, సుతారి సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ నంగి దేవేందర్ రెడ్డిలు సమన్వయం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *