– రాబోయేది బీఆరఎస్ ప్రభుత్వమే
– కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నాం
– బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు
జమ్మికుంట, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రపంచమే అబ్బురపడ్డ రైతు బంధు, దళిత బంధు పథకాలు ప్రారంభమైంది హుజురాబాద్ నుంచేనని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఉప నాయకుడు టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో రైల్ రోకోతో దిల్లీని స్తంభింప చేసిన గడ్డ ఈ హుజురాబాద్ అని గుర్తు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో శుక్రవారం నిర్వహించిన బీఆరఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించి కాంగ్రెస్ మోసాలను గ్రామగ్రామానికి తీసుకుపోయే కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించబోతున్నదని తెలిపారు. కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలను తెచ్చారు.. ప్రజలు కృతజ్ఞతతో ఓట్లు వేస్తారనుకుంటే రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో ప్రజలు చిక్కుకుని బీఆర్‌ఎస్‌ను ఓడించారన్నారు. ఇపుడు రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు.. 11 సార్లు రూ.74 వేల కోట్లను రైతుల అకౌంట్‌లో వేసిన ఈ దేశంలోనే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి రూ.20 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టి రుణ మాఫీ చేసిన అని సంకలు గుద్దుకుంటుండు అని హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చినా కరెంట్ పోలేదు.. తాగు నీటికి ఇబ్బంది రాలేదు.. కాల్వల్లో నీళ్లు పారినాయి అని తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కోతలు మొదలైనాయి.. తాగడానికి నీళ్లు లేవు.. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి.. రైతులు కన్నీరు పెడుతున్నారు.. రైతు బీమా బంద్ అయింది.. ఎలఐసీకి డబ్బులు కట్టలేదు అని చెప్పారు. కేసీఆర్ తెచ్చిన పథకమని రైతులకు ఉపయోగపడే పథకాన్ని ఆపడం తగునా రేవంత్ రెడ్డీ అని నిలదీశారు. రేవంత్ రెడ్డి వచ్చుడుతోనే ఎరువుల కష్టాలు మొదలయ్యాయన్నారు. తరుగు లేకుండా వడ్లు కొనడం లేదు.. రైతులు 40, 50 రోజులకుపైగా వడ్లు అమ్ముకోడానికి, మక్కలు అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్నారు.. రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, వడ్లు కొనమంటే చుక్కలు చూపుతున్నరు.. యాసంగి పంటకు బోనస్ ఎగ్గొట్టిన్రు అని హరీష్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి రైతు డిస్కం అమలు చేస్తే కరెంటు 5, 6 గంటలు మాత్రం వస్తుంది.. రైతు అనేవాళ్లు ఇక కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితి లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడినా అన్నీ అబద్ధాలేనన్నారు. జూబ్లీహిల్స్‌లో ఆయనకున్న ప్యాలెస్ సరిపోదని రూ.100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు.. ప్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ రూ.100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు.. నెలకు రూ.5 కోట్లు ఖర్చు పెట్టి కొత్త హెలికాప్టర్ కొంటున్నడు అని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి.. అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డీ.. గుర్తు పెట్టుకో.. నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు అని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా రాదంటున్నడు.. ప్రతిపక్ష హోదా కాదు పాలకపక్ష హోదా రాబోతోంది అని వ్యాఖ్యానించారు. దేశంలో సీఎంలు ఓడిపోయే ట్రెండ్ నడుస్తున్నదన్నారు. బెంగాల్, తమిళనాడులో అదే జరిగింది. ఇక తెలంగాణలో అదే రిపీట్ అయితదని అన్నారు. గ్యారంటీగా రాసి పెట్టుకోండి మళ్ళొచ్చేది కారే.. ఏర్పడేది కేసీఆర్ సర్కారే అని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు.. డంపింగ్ యార్డ్ గురించి పోరాడితే కేసులు పెట్టి సీఐడీ ఆఫీసుల చుట్టూ తిప్పారు.. అయినా మీ తరపున గట్టిగ నిలబడ్డాడు. అని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యఫై బీఆర్‌ఎస్ పార్టీ గళమెత్తుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయింది. ఇప్పటివరకు మేడిగడ్డ రిపేర్ చెయ్యలేదు. కాళేశ్వరం విలువ కాలం కానపుడే తెలుస్తుంది. ఈ సంవత్సరం కాంగ్రెస్‌కు అది అర్థం అయింది అన్నారు. చాలామంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు.. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే కార్యకర్తలే మాకు దేవుళ్ళు అని హరీష్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



