మల్లన్న సన్నిధికి రైలు వ‌చ్చేసింది!

– భక్తుల చిరకాల నిరీక్షణకు తెర
– రేపు కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
–  నాలుగు డెమో రైళ్లకు హాల్టింగ్
– ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు
సిద్దిపేట ప్రజాతంత్ర, జులై 25 : తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం చరిత్రలో శనివారం మరో స్వర్ణాక్షరాల అధ్యాయం లిఖితమవుతోంది. దశాబ్దాలుగా భక్తులు ఎదురుచూస్తున్న రైల్వే సౌకర్యం కల సాకారమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ఈ నెల 26న అధికారికంగా ప్రజలకు అంకితం కానుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం. రఘునందన్‌రావు ఈ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి సికింద్రాబాద్–సిద్దిపేట మార్గంలో నడిచే నాలుగు డెమో రైళ్లకు కొమురవెల్లిలో అధికారికంగా హాల్టింగ్ కల్పించనున్నారు.
కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, పెద్దపట్నం, శివరాత్రి, ఇతర పర్వదినాల సమయంలో ఆలయానికి భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు రైల్వే సౌకర్యం లేకపోవడంతో భక్తులు పూర్తిగా రోడ్డు రవాణాపైనే ఆధారపడాల్సి వచ్చేది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ముందుగా సికింద్రాబాద్, గజ్వేల్, సిద్దిపేట లేదా జనగామ వరకు రైలులో చేరుకుని అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాల్సి వచ్చేది. దీంతో ప్రయాణ సమయం పెరగడమే కాకుండా అదనపు ఖర్చు, ట్రాఫిక్ ఇబ్బందులు, పండుగల సమయంలో గంటల తరబడి నిరీక్షణ తప్పేది కాదు. ఇప్పుడు కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. రైలు దిగిన కొద్ది సమయంలోనే మల్లన్న సన్నిధికి చేరుకునే వీలుండటంతో భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు ఈ స్టేషన్ గొప్ప వరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం లభించనుంది.
– మల్లన్న సన్నిధికి వచ్చే రైలు బండి షెడ్యూల్
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నెం. 77654 మధ్యాహ్నం 2.38 గంటలకు కొమురవెల్లి స్టేషన్‌లో ఆగుతుంది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య నడిచే రైలు నెం. 77655 రాత్రి 8.04 గంటలకు హాల్టింగ్ ఇస్తుంది. అలాగే రైలు నెం. 77656 ఉదయం 7.04 గంటలకు, రైలు నెం. 77653 మధ్యాహ్నం 12.52 గంటలకు కొమురవెల్లి స్టేషన్‌లో ఆగనున్నాయి. ఈ రైళ్ల ద్వారా రోజులో వివిధ సమయాల్లో భక్తులకు రాకపోకల సౌకర్యం కలగనుంది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రూ. 5.63 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్‌ను నిర్మించింది. స్థానిక ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సుందరమైన ప్రవేశ ద్వారం, 450 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో హై-లెవెల్ ప్లాట్‌ఫారమ్, ఐదు విశాలమైన షెల్టర్లు, ఆధునిక వెయిటింగ్ హాల్, టికెట్ బుకింగ్ కౌంటర్లు, తాగునీటి వసతి, మహిళలు, పురుషులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, విశాలమైన పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా వంటి అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టేషన్ ముఖద్వారాన్ని స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించగా, గోడలపై మల్లన్న స్వామి వైభవం, స్థానిక ప్రకృతి, అటవీ సంపదను ఆవిష్కరించే అందమైన మ్యూరల్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రైల్వే స్టేషన్ కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు, కొమురవెల్లి క్షేత్ర అభివృద్ధికి కొత్త దిశను చూపే ప్రగతి చిహ్నంగా భావిస్తున్నారు. స్టేషన్ ప్రారంభంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, లాడ్జీలు, ఆటో, క్యాబ్ సేవలు, చిన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కానుంది.
రాజీవ్ రహదారికి సమీపంలోనే..
రాజీవ్ రహదారి కి సమీపంలో ఉండటం వల్ల రైలు దిగిన భక్తులు అతి తక్కువ సమయంలో ఆలయానికి చేరుకునేలా రవాణా అనుసంధానం మెరుగుపడనుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయాణికుల రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తే కొమురవెల్లి పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైలు కూతతో ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయం మల్లన్న సన్నిధికి చేరుకునే లక్షలాది మంది భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే కాక కొమురవెల్లి ప్రాంత అభివృద్ధికి కూడా బలమైన పునాది వేయనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *