– అపోహలు తొలగిస్తేనే భవిష్యత్
- మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్, జూలై 25: ప్రపంచమంతా ఏఐ నామస్మరణ వినిపిస్తున్న నేపథ్యంలో మైక్రోసాప్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ రంగంలో మానవ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే నిరంతర భయాల కారణంగా ప్రజలు ఏఐ రంగంపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొన్నారు. వారి విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు. ఉదాహరణకు ఒక సంస్థ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్లయితే.. స్థానిక ప్రజలకు అది ఎంత ఉపయోగకరమో వివరించాలన్నారు. అప్పుడే వారు దాని అవసరాన్ని గుర్తిస్తారన్నారు. ప్రస్తుతం ఉత్పాదకతను మెరుగుపరచడానికి మాత్రమే కాక ఇతర పనులకు కూడా కృత్రిమ మేధను వినియోగిస్తున్నారని సత్య నాదెళ్ల అన్నారు. దీంతో రాబోయే ఏఐ యుగం మునుపటిలా కాక భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. మానవుల పరిజ్ఞానం, సృజనాత్మకతకు ఏఐ సాంకేతికత కలిస్తేనే భవిష్యత్ సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఏఐని స్వతంత్ర మేధస్సుగా చూడకూడదని, మానవ ఆలోచనలను పెంచే, ప్రజల లక్ష్యాల సాధనకు దోహదపడే టూల్‌గా చూడాలన్నారు. ఉద్యోగాల నుంచి కార్మికులను తొలగించి వారి స్థానంలో ఏఐని తీసుకురాకుండా మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ సాంకేతికతను ఉపయోగించాలని కంపెనీలకు ఆయన సూచించారు. మానవులు, ఏఐ వ్యవస్థలు ఒకరి నుంచి ఒకరు నిరంతరం నేర్చుకోగల దశలోకి ప్రస్తుత వ్యాపారాలు ప్రవేశిస్తున్నాయన్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి, మంచి వేతనాలు నిర్ణయించడానికి కూడా ఏఐని వినియోగించాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





