– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : ములుగు జిల్లాలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులందరికీ ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. అయితే పర్యాటకులు తమ ఆనంద యాత్రను విషాదంగా మార్చుకోకుండా తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం, పోలీసు, అటవీ శాఖ అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క వీడియో సందేశం విడుదల చేశారు. ములుగు జిల్లా ప్రకృతి సంపదకు నిలయమని, దట్టమైన అడవులు, గోదావరి పరీవాహక ప్రాంతం, బొగత జలపాతం, అందమైన సెలయేళ్లు, చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏటా వేలాదిమంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సమ్మక్క-సారలమ్మ మేడారం, రామప్ప దేవాలయం, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ సురక్షితంగా వెళ్లి సంతోషకరమైన జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఇటీవల నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లోతైన అడవులు, ప్రమాదకరమైన జలపాతాలు, కొండచరియలు, వేగంగా ప్రవహించే వాగులు, సెలయేళ్ల వద్దకు వెళ్లవద్దని ఇప్పటికే పోలీసులు, అటవీ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయినా కొందరు ఆసక్తితో బ్యారికేడ్లను దాటి నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి ప్రాణాలను పమాదంలో పడేస్తుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటకుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. బ్యారికేడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటరాదని, హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా గౌరవించాలని, సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లి సాహసాలు చేయవద్దని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





