శ‌ర‌ వేగవంగా మక్తల్-నారాయణపేట ఎత్తిపోతల పనులు

– అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
– రెండు రోజుల పర్యటన కోసం కొడంగల్ చేరుకున్న సీఎం

కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 21 : రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో నియోజకవర్గం అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలను అధికారులు వివరించారు. ప్రాజెక్టు భూ సేకరణ విషయంలో జాప్యం జరగొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన సర్వేయర్లతోపాటు బడ్జెట్ మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని, టెండర్ పనులు మొదలు పెట్టాలని సీఎం. ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇకనుంచి ప్రతి నెలా పనుల పురోగతిపై తనిఖీ చేస్తానని, నెలలో ఒక రోజు సైట్ లోనే బస చేస్తానని చెప్పారు. గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనలో పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలో ఏ తండాలో రోడ్డు లేదన్న మాట వినిపించొద్దంటూ ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చూడాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించాలని కూడా ఆదేశించారు. ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులు పర్యవేక్షించాలని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *