– యాసంగిలో వరి, పత్తి వద్దు
– ఎల్-నినో ప్రభావంతో తీవ్ర జల, ఇంధన సంక్షోభం
– రాబోయే 10 నెలలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి
– ఆరుతడి పంటలకే మొగ్గు చూపాలని మంత్రి తుమ్మల పిలుపు
– రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో తీవ్ర జల, ఇంధన సంక్షోభం పొంచి ఉందని, అందువల్ల ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని కేవలం తాగునీటికి, పశువుల అవసరాలకే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ యాసంగి (రబీ) సీజన్లో వరి, పత్తికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ సంజయ్ జాజు తదితరులు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎల్-నినో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం ఎల్-నినో ప్రభావం డిసెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, 2027 వరకు ఈ పరిస్థితులు కొనసాగే ప్రమాదం ఉందన్నారు. రానున్న జూన్, జులై వరకు వర్షాలు కురిసే అవకాశం లేనందున నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఆరుతడి పంటలకే సబ్సిడీ: మంత్రి తుమ్మల
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే 315 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైందని, అందువల్ల రైతులు వరి, పత్తి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. తక్కువ సమయంలో పండే ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై అందిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉన్నతస్థాయి బృందాన్ని ఢిల్లీకి పంపుతామన్నారు.
10 నెలలు తాగునీటికే ప్రాధాన్యం: సీఎస్
రాష్ట్రంలో 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. కృష్ణా బేసిన్లో 270 టీఎంసీలకు గాను కేవలం 80 టీఎంసీలు, గోదావరిలో 150 టీఎంసీలకు గాను 100 టీఎంసీల నీరే వచ్చిందని వివరించారు. ఈ నేపథ్యంలో రానున్న 10 నెలలు వ్యవసాయానికి నీరు అందించే పరిస్థితి లేదని, కేవలం తాగునీటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
విద్యుత్ ఉత్పత్తి డౌన్.. పప్పు దినుసులకే సై
జలాశయాల్లో నీరు లేకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 25 శాతానికి పడిపోయిందని, దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ కొరత ఉందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. మరోవైపు వాతావరణం సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా వేడెక్కుతోందని అధికారులు హెచ్చరించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నీటిని తక్కువగా వినియోగించుకునే 4 రకాల పప్పు దినుసులు (పెసలు, మినుములు, శనగలు, వేరుశనగ), 4 రకాల నూనెగింజల (సన్‌ఫ్లవర్, నువ్వులు, కుసుమ) సాగుపైనే రైతులు దృష్టి సారించాలని, వరికి ‘క్రాప్ హాలిడే’ ప్రకటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. రాష్ట్రంలోని 1.39 కోట్ల జీవాలకు ఎమర్జెన్సీ క్యాంపుల ద్వారా తాగునీరు, పశుగ్రాసం అందిస్తామని పశుసంవర్ధక శాఖ తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




