– వారిని అర్థం చేసుకుని ప్రేమగా చర్చించాలి
– ఆదేశాలతో కాదు..అర్థవంతమైన చర్చలతో సాగాలి
– ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
న్యూదిల్లీ, జూలై 25: నేటితరం యువత ఆలోచనాపరులని, వారిని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సి ఉందని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి తరం మార్గదర్శకత్వం లేనిదో లేదా దారి తప్పినదో కాదని స్పష్టం చేశారు. వారిని అర్థం చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం కాక అర్థవంతమైన చర్చలు జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దిల్లీ వీధుల్లో విద్యార్థుల నిరసనలతో వాతావరణం వేడెక్కిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విశ్వ మాంగల్య సభ కార్యక్రమంలో మాట్లాడిన మోహన్ భగవత్ తరాల మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. ‘మేము యువకులుగా ఉన్నప్పుడు విధేయత చూపించే వాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నేటి తరం ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉంది. కాబట్టి మనం వారికి ప్రతి విషయాన్ని కారణాలతో వివరించాల్సి ఉంటుంది. వారిపై ఎనలేని ప్రేమను చూపిస్తూ వారితో సమయం గడపాలి. కుటుంబాల్లో సంభాషణలు తగ్గిపోతుండటం ఆందోళనకరం. యువత నమ్మకాన్ని గెలవాలంటే హుకుం జారీ చేయడం కాదు.. వారితో మాట్లాడాలి. వారికి ఓ ఆత్మీయ భావన కలిగించాలి.. ఆదేశాలు జారీ చేయడం కాక చర్చలు జరిపి ఒక ఏకాభిప్రాయానికి రావడం ముఖ్యం అని భగవత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మోహన్ భగవత్ గారూ.. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పరిణామాలపై నెల రోజులుగా మీరు పాటిస్తున్న మౌనం ఉపన్యాసాల కంటే చాలా శక్తివంతంగా ఉందని విమర్శిం చారు. కొత్తతరంతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడిపి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను, యువత ఆలోచనా విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేటి కాలంలో ప్రతీది మొబైల్‌లోనే నిక్షిప్తమై ఉందన్నారు. నేటి కుటుంబాల్లోనూ పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ దండయాత్రలు, బ్రిటీష్ పాలన వల్ల భారత ప్రజల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. బ్రిటీష్ పాలన వల్ల మన సంప్రదాయాలు తప్పని, విదేశీ పద్ధతులే సరైనవనే భావన భారతీయుల్లో పెరిగిందని వ్యాఖ్యానించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. టెక్నాలజీని మానవాళి శ్రేయస్సు కోసం వాడుకోవాలని సూచించారు. అపరిమితమైన కోరికలు, భౌతికవాదం సమాజంలో పోటీని, సంఘర్షణలను పెంచుతాయని మోహన్ భగవత్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





