నా దీక్షనే అనుమానిస్తారా?

-కేంద్రంతో లాలూచీ పడతాననుకున్నారా
-విమర్శలపై సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ‌ఘాటు స్పందన

న్యూదిల్లీ,జూలై 25: దాదాపు 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ఇటీవల కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ ‌సమక్షంలో దీక్షను విరమించారు. తాను ఎందుకు నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చిందో తాజాగా సోనమ్‌ ‌వివరించారు. ప్రభుత్వంతో ఎలాంటి రహస్య ఒప్పందమూ చేసుకోలేదని, నిరసనకారుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై హింసాత్మక చర్యలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన కలిగిందని వాంగ్‌చుక్‌ ‌పేర్కొన్నారు. గతంలో లడఖ్‌లో జరిగిన పోలీసు చర్యల మాదిరిగా పరిస్థితి మారకూడదనే ఉద్దేశంతో ఉపవాసాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అంశాలపై లిఖితపూర్వక హామి లభించిందని ఆయన తెలిపారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై ప్రతీకార చర్యలు ఉండవని, వారి సమస్యలపై చర్చ కొనసాగుతుందని ప్రభుత్వం హామి ఇచ్చిందని పేర్కొన్నారు . అయితే దీక్ష విరమించడం అంటే ఉద్యమం ముగిసినట్లు కాదని స్పష్టం చేశారు. కాగా, జంతర్‌ ‌మంతర్‌లో నిరసన చేపడుతున్న సీజేపీ నేతలు మాత్రం తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ 26 ‌రోజుల నిరాహార దీక్షను కేంద్ర మంత్రుల సమక్షంలో విరమించిన నేపథ్యంలో డీల్‌ ‌కుదిరిందంటూ ఆయనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘నేను చేసిన దీక్ష ఎంత స్వచ్ఛమైందో నిరూపించుకునేందుకు సర్టిఫికెట్‌ ‌కావాలా అని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్‌ ‌మీడియాలో వీడియో విడుదల చేశారు. దీక్ష విరమించినప్పటి నుంచి చాలామంది నాకు ఫోన్‌ ‌చేస్తున్నారు. కేంద్ర మంత్రుల సమక్షంలోనే ఎందుకు దీక్ష విరమించారు? ఏం ఒప్పందం జరిగింది అని అడుగుతున్నారు. నేను నిరాహార దీక్ష ఎంత పవిత్రంగా చేశానో ఎవరి నుంచైనా సర్టిఫికెట్‌ ‌తీసుకోవాలా.. ఇలా బేరాలు కుదుర్చుకోవాల్సి వస్తే ఎవరైనా 26 రోజులు ఆకలితో ఉంటారా.. దిల్లీ ఎండలో రోడ్డు పక్కన కూర్చునే బదులు ఏసీ గదిలో కూర్చొని డీల్‌ ‌చేసుకోలేనా‘ అని తనపై వస్తోన్న విమర్శలకు వాంగ్‌చుక్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా అనేది కచ్చితంగా ముఖ్యమైన విషయం. అయితే నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే నాకు ప్రాధాన్య అంశంగా అనిపించింది. అందుకే కేంద్రంతో చర్చల సమయంలో రాజీనామా గురించి నేను డిమాండ్‌ ‌చేయలేదు. రాజీనామాను వ్యక్తిగతంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు. దీన్ని కేంద్రం పెద్ద విషయంగా భావించడం లేదు. రాజీనామా అంశాన్ని నిరాకరించడం వల్ల అపారనష్టాన్ని చవిచూస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజారుతోంది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాజీనామా విషయంలో కేంద్రం ఎక్కువ కాలం నాన్చలేదు. కొన్నిరోజుల్లో మంత్రి రాజీనామా సమర్పిస్తారని నాకు తెలుసు. అందుకే ఆ విషయంలో నేను మరీ ఎక్కువ ఒత్తిడి చేయలేదు‘ అని వాంగ్‌చుక్‌ ‌వివరించారు. దీక్ష కొనసాగిస్తున్న సమయంలో దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వాంగ్‌చుక్‌ను జంతర్‌మంతర్‌ ‌నుంచి సప్ధర్‌జంగ్‌ హాస్పిట‌ల్‌కు తరలించారు. అక్కడి పరిస్థితులపై తాజాగా వాంగ్‌చుక్‌ ‌స్పందించారు. ఆ హాస్పిట‌ల్‌ జైలులా అనిపించింది. ఒక ఖైదీ కంటే తీవ్రంగా పరిగణించారు. చుట్టూ ఆంక్షలే. నేను నా గది నుంచి కూడా రాలేకపోయా. ఎవరిని కలవడానికి అనుమతించలేదు. ముగ్గురు బంధువులను మాత్రం నావద్దకు రానిచ్చారు అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *