ప్రైవేటు సంస్థలకు దీటుగా రాణించాలి

– సింగరేణి విస్తరణకు ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతు
– రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్‌లోకి విస్తరించాలి
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– మణుగూరు ఓసీ, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిశీలన

కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 24 : సింగరేణిని కాపాడుకోవడానికి, బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి ప్రజా ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం ప్రభుత్వం తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటుందని భరోసా కల్పించారు. కొత్తగూడెంలోని సింగరేణికి కార్యాలయంలో సింగరేణి, జెన్‌కో ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతకుముందు మణుగూరు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గనిలోకి వెళ్లి బొగ్గును స్వయంగా చేతిలోకి తీసుకుని దాని నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా తాడిచెర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడంతో సంస్థవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు సంతోషంగా సంబరాలు జరుపుకున్నారని ఉప ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా ఆయన పరిశీలించి విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్న బొగ్గు వివరాలను, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు 4X270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణకు సింగరేణి ఆత్మ వంటిదని, 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఉత్పత్తి రంగంలో సింగరేణిది ఏకఛత్రాధిపత్యం ఉండేదన్నారు. ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకే వినియోగదారులు బొగ్గును కొనుగోలు చేసేవారని, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల బహిరంగ వేలం విధానాన్ని తీసుకురావడంతో అనేక ప్రైవేట్ సంస్థలు రంగంలోకి వచ్చాయని చెప్పారు. దీంతో ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ వారితో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రైవేట్ సంస్థలతో నాణ్యత, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం, ఉత్తమ సేవల్లో పోటీపడి సింగరేణి స్థానాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు నాణ్యత విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదన్నారు. తవ్వకాల సమయంలో బొగ్గులో మట్టి, రాళ్లు కలవకుండా సునిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు శుద్ధీకరణను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వేర్వేరు గ్రేడ్ల బొగ్గును సరైన నిష్పత్తిలో బ్లెండింగ్ చేసి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించాలన్నారు. బీఆరఎస్ ప్రభుత్వానికి ముందుచూపు, సుదీర్ఘ ప్రణాళికలు లేకపోవడం వల్ల సింగరేణి వేలంలో పాల్గొని నూతన బొగ్గు బ్లాకులను పొందకలేకపోయిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి వంటి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో సరైన ప్రణాళికలు రూపొందించలేదన్నారు. వాటికి అవసరమయ్యే బొగ్గు బ్లాకులను కేటాయించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఒడిశాలోని నైనీ బ్లాక్, తాడిచర్ల-2 ప్రాజెక్టులపై ఉన్న భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వేగవంతం చేసి పరిష్కరించిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. సింగరేణి అనేది ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు.. వేలాదిమంది కార్మిక కుటుంబాల జీవితమని అన్నారు. సంస్థ లాభాల్లో ఉంటేనే కార్మికుల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని అన్నారు. ప్రతి గని స్థాయిలో మేనేజ్‌మెంట్, కార్మిక సంఘాలు ప్రతి కార్మికుడితో చర్చలు ప్రారంభించాలని, సంస్థ మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అందరినీ భాగస్వాములను చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. అదేవిధంగా, సంస్థ భవిష్యత్తు అవసరాలు, ఉత్పత్తి లక్ష్యాల దృష్ట్యా పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్ ను కూడా సింగరేణికే కేటాయించేలా ప్రభుత్వం చొరవ చూపాలని అధికారులు ఉప ముఖ్యమంత్రికి కోరారు. సెమీకండక్టర్స్, చిప్స్, ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల మైనింగ్ రంగానికి సింగరేణి విస్తరించాలన్నారు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో క్రూషియల్ మినరల్స్ వేలంలో సింగరేణి పాల్గొనాలని చెప్పారు. సింగరేణి వద్ద దశాబ్దాల అనుభవం కలిగిన నిపుణులైన ఇంజనీర్లు, మైనింగ్ కార్మికులు ఉన్నారని అన్నారు. ఈ అపారమైన మానవ వనరులను అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులకు ఉపయోగించాలన్నారు. ఇకపై బోర్డు సమావేశాలు కేవలం రొటీన్ పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా, సంస్థ విస్తరణ, రాబోయే పదేళ్ల రోడ్‌మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచనలు చేశారు. కార్పొరేట్ సంస్థల మాదిరి టైమ్ లైన్ క్యాలెండర్ పెట్టుకుని లక్ష్యాలను పూర్తిచేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *