– ఓఆర్‌ఆర్ లోపల ప్రభుత్వ భూముల గుర్తింపు
– పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖల భూముల సేకరణ
– క్యూర్ పరిధిలో ఇళ్ల నిర్మాణంపై సిఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: నగరంలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకాన క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఇళ్లపై ఉన్నతాధికారులతో ఆయన సక్ష నిర్వహించారు. ఓఆర్‌ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న వివిధ స్థలాలను గుర్తించాలని సూచించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించిన స్థలాలను తీసుకుని.. ఆయా శాఖలకు వేరే చోట కేటాయించాలని రేవంత్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను జనావాసాలకు దూరంగా కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల పని ప్రదేశాలకు దగ్గరగా.. జనావాసాల పరిధిలో ఇళ్లు నిర్మిస్తే నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారన్నారు. క్యూర్ ఏరియాలోని పలు నియోజకవర్గాల్లో ఒక్కో ప్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఇళ్లు నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, దీనిలో ప్రభుత్వం రూ. 5 లక్షల మేర సబ్సిడీని అందించనుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్దిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. భూమికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనుంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించి ఇళ్ల నిర్మాణానికి వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను గృహ నిర్మాణం కోసం వినియోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖాళీ ప్రభుత్వ భూముల గుర్తింపు పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు నగరానికి చేరువలోనే గృహాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే పక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో 
ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి అధ్యయనంతో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ బ్యూరో సంస్థాగత నిర్మాణం చేపట్టాలన్నారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై ఎంసీహెచఆర్‌డీలో డీజీపీ, సీఎస్‌లతో కలిసి ఆయన శుక్రవారం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని, ట్రాఫిక్ విషయంలో నిబంధనల కంటే క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. వాతావరణ మార్పులు, పనివేళలు, రద్దీ సమయాల, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు.ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఔటర్‌పై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవసరమైనచోట అండర్ పాస్, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించాలన్నారు. సాధ్యమైనంత వరకు సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు ఉండేలా చూడాలన్నారు.
సీఎం తొలి ఏకాదశి శుభాకాంక్షలు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





