– రాష్ట్ర అభివృద్దికి సంబంధించి విన్నపాలు
న్యూదిల్లీ, మే 27: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ దిల్లీలో తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్‌లో బుధవారం కలుసుకున్నారు. తొలుత దిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్ అక్కడినుంచి ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. తమిళనాడుకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయంతో పాటు పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇద్దరూ కలిసిన సందర్భంగా తీసిన ఫొటోలను పీఎంవో ’ఎక్స’ వేదికగా పోస్టు చేసింది. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ’అనైమంగళం’ రాగి శాసనాలను తిరిగి భారత్‌కు రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మేకెదాటు డ్యామ్ వివాదం అంశంపైనా ప్రధానితో చర్చించినట్లు పేర్కొంది. తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం, వేధించడం వంటి ఘటనలు పెరుగుతుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే 12 అరెస్టులు నమోదయ్యాయని, ప్రస్తుతం 58మంది మత్స్యకారులు శ్రీలంక నిర్బంధంలో ఉన్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. మత్స్యకారులను, వారి పడవలను తక్షణమే విడుదల చేయాలని శ్రీలంక ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా అభ్యర్థించినట్లు పేర్కొంది. అనంతరం ఆయన నేరుగా తమిళనాడు హౌస్‌కు చేరుకోవడంతో గౌరవ వందనంతో ఆయనకు సాదర స్వాగతం లభించింది. తమిళనాడు సీఎంగా విజయ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దిల్లీకి రావడం ఇదే ప్రథమం. తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలుసుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను 10 జన్‌పథ్‌లో కలుసుకోనున్నారు. విజయ్ సమావేశం నేపథ్యంలో జన్‌పథ్ వెలుపల రాహుల్-విజయ్ ఫోస్టర్లు వెలిసాయి. కాగా, వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీల నేతలు కూడా తమిళనాడు హౌస్‌లో విజయ్‌ను కలుసుకోనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




