- డొంకను తలపిస్తున్న నేషనల్ హైవే 563
- రోజుకో ప్రమాదం.. వారానికో మరణం
- తొర్రూరు నుంచి మరిపెడ వరకు ఇదే పరిస్థితి
- నెత్తురోడుతున్నా నిద్రావస్తలోనే ఎన్ హెచ్ అధికారులు
- తాజాగా కూలీలతో వెళ్తున్న ఆటోకు ప్రమాదం
- ఒకరు మృతి, 17 మందికి గాయాలు.. ముగ్గురికి సీరియస్
మరిపెడ, ప్రజాతంత్ర, మార్చి 21: అర కిలో మీటరుకు అర డజను గుంతలు అంటే అదేదో డొంకదారి అనుకునేరు.. కాదండి.. సాక్షాత్తు జాతీయ రహదారి 563పరిస్థితి. ప్రతి ఏటా తారు కొట్టుకుపోయి గుంతలు పడి డొంక కన్నా అధ్యాన్నంగా మారుతోంది. ప్రతి ఏటా వానాకాలం వచ్చిందంటే చాలు రోడ్డుపై అక్కడక్కడా తారు కొట్టుకు పోయి ఫీటు లోతు గుంతలు పడుతున్నాయి. తొలుత చిన్న గుంతగా ప్రారంభమైన గుంత కాస్తా వాహనాల రాకపోకలతో చినికి చినికి రోడ్డంతా విస్తరిస్తోంది. ఫలితంగా రోడ్డు సాఫీగా ఉందనుకుని వేగంగా వచ్చే వాహనాలు ఒక్కాసారిగా గుంతలో పడి అయితే కుదుపునకు గురికావటం లేదంటే.. ఒక్కరిగా టైరు పగిలి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పొవటం జరుగుతోంది. ఇక ద్విచక్ర వాహనదారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రాత్రైతే ఎదురుగా వచ్చే అధిక కాంతితో రోడ్డు, గుంతలు కనబడక గుంతల్లో పడి ప్రాణాలు కొల్పొయిన వారు 2024 నుంచి 2025వరకు పదుల సంఖ్యలో ఉన్నారు.
ప్రమాదాలకు నిలయంగా తొర్రూరు - మరిపెడ రహదారి
కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న నేషనల్ హైవే 563పై అతి ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతం తొర్రురు నుంచి మరిపెడ (Thorrur-Maripeda road) వరకు అనటంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఏటా ఈ మధ్య రహదారిపై వందల వాహనాలు ప్రమాదాలకు గురై.. ఎందరో ప్రాణాలు కొల్పొతున్నారు. దీనికి ప్రధాన కారణం రోడ్డు రెన్యూవల్ పనిలో నాణ్య త లేకపోవటం.. ప్రమాద సూచీలు ఏర్పాటు చేయకపోవటం, సరైన సమయానికి మెయింటెనెన్స్ లేకపోవటం.. ప్రధానంగా నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లోపమే వాహనాదారులు తెలుపుతున్నారు. రెన్యూవల్ చేసే క్రమంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించపోవటంతో పోసిన మూన్నాళ్లకే అక్కడక్కడా రోడ్డు ధ్వంసం కావటం.. క్రమంగా కి.మీ మేర తారు కొట్టుకుపోవటం జరుగుతోంది. దీంతో వాహనాలు తరచూ ప్రధానంగా రాత్రుళ్లు ప్రమాదాలకు గురవుతున్నాయి.

నిధులు మంజూరైనా పనుల్లో జాప్యం..
నేషనల్ హైవే 563కి సంబంధించి తొర్రురు నుంచి మరిపెడ వరకు సుమారు 30కి.మీ మేర ప్యాచ్ వర్క్ కోసం రూ.56 లక్షలు 2024 సెప్టెంబరు నెలలో మంజూరు చేయటం జరిగింది. అయితే ఈ పనిని నేషనల్ హైవే అథారిటీ వారు ఆర్ అండ్ బీ ఎన్ హెచ్ ఏ ఐ వారికి అప్పగించారు. కాగా సదరు ఎన్ హెచ్ ఏఐ అధికారులు పనుల మంజూరైన నిధులతో రోడ్డు ధ్వంసం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి సుమారు 30కి.మీ మేర ప్యాచ్ వర్క్, స్పాట్ హోల్స్ పూడ్చటం వంటి పనులు కాంట్రాక్టర్ ద్వారా చేయించాల్సి ఉంటుంది. కానీ పనికి నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా పని జరగక పోవటంతో గుంతలు మరింత పెద్దగై రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ విషయమై సదరు ఎన్హెచ్ ఏఐ ఏఈ అధికారిని ఫోన్లో సంప్రదించాలని ప్రజాతంత్ర ప్రయత్నించగా ఎన్ని సార్లు ఫోన్ చేసినా సదరు అధికారి అందుబాటులోకి రాలేదు.
అధికారులపై వాహన దారుల ఆగ్రహం..
నిత్యం ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లే ఇంటి పెద్దలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే.. ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతోంది. ఒక వైపు వాహనదారుల తప్పిదాలతో ప్రమాదాలు జరుగుతుంటే.. మరో వైపు కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారుల ప్రాణాలు గాల్లొ కలిసిపోతున్నాయి. దీంతో అటు వాహనదారులు, ఇటు ప్రజలు సదరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మంజూరైన నిధులతో తొర్రురు – మరిపెడ మధ్యలో ఎన్ హెచ్ 563ని మరమ్మతులు చేయాలని, అమాయక ప్రజల ప్రాణాలను కాపాడి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
వాహనదారులు నెమ్మెదిగా వెళ్లాలి..
నేషనల్ హైవే 563 మరిపెడ నుంచి తొర్రురు వరకు రోడ్డు గుంతలు పడి ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ఈ ప్రాంతంలో నెమ్మదిగా చూసుకుంటు ప్రయాణం చేయాలి. ప్రధానంగా రాత్రుల్లో వీలైంత నిదానాన్ని పాటించి ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి. ద్విచక్రవాహనదారులు రాత్రుళ్లు సాధ్యమైనంత వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలి.
– రాజ్ కుమార్ గౌడ్, సీఐ మరిపెడ





