– సీఎం రేవంత్ సారీ చెప్పాలి
– రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- టీషర్టులతో మీరు పార్లమెంట్‌కు వెళ్తారు
– మేము టీషర్టులతో అసెంబ్లీకి రాకూడదా?
– ఇది ముమ్మాటికీ దుశ్శాసన సభ
– మహిళా నేతల జుట్టు పట్టుకుని ఈడ్చేస్తారా?
– ఈ దాడి వెనుక రేవంత్ రెడ్డి కుట్ర ఉంది
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: ప్రస్తుత శాసనసభ ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం లేదని, అది కౌరవ సభను తలపిస్తోందని బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ చరిత్రలోనే ఈరోజు అత్యంత నల్లని రోజుగా మిగిలిపోతుందని, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను దుర్మార్గంగా ప్రయోగిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్ సభ్యులు, పోలీసుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నినాదాలతో కూడిన టీషర్టులతో రావద్దని బీఆర్‌ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అభ్యంతరంతో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టీ షర్టులు విప్పేశారు. బనియన్లపై ఉన్న హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద కేటీఆర్, హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పోలీసుల తీరుపై సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తన పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆమె కంటతడి పెట్టుకున్నారు. పోలీసుల వైఖరిని కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు తప్పుపట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ టీషర్టులు వేసుకుని పార్లమెంట్‌కు వెళ్లారని, తాము అలా అసెంబ్లీకి రాకూడదా అని ప్రశ్నించారు. నల్ల టీషర్టుపై హామీలు అమలు చేయాలని మాత్రమే ఉందని తెలిపారు. నిరసన తెలిపే హక్కు తమకు ఉందన్న ఆయన, తమ ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీకి రాకూడదనే ఇలాంటివి చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీకి వస్తే ప్రశ్నిస్తారనే అడ్డుకుంటున్నారని, ప్రధాన ప్రతిపక్షం లేకుండానే చర్చ జరపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీకి రావడం నేరం కాదని పేర్కొన్నారు. నల్ల టీషర్టులపై అభ్యంతరకర పదాలున్నాయని తెలిపారు. టీషర్ట్‌లపై ఉన్న పదాల కారణంగానే అసెంబ్లీ లోపలికి అనుమతించలేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదన్న డీసీపీ పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ ఆరోపణలను పరిశీలిస్తామన్నారు. స్పీకర్ సూచనల మేరకే పోలీసులు వ్యవహరించారన్న శిల్పవల్లి, అసెంబ్లీ గేటు దగ్గర జరిగిన ఘటన వీడియోలను పరిశీలిస్తామన్నారు. ఆందోళన సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగడం, సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కడం వంటి ఘటనలు అత్యంత అమానుషమని ధ్వజమెత్తారు. మహిళా సభ్యుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన అధికారులను సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తోపులాటలో జగదీష్ రెడ్డిని కింద పడేసి తొక్కేందుకు యత్నించారని, కేటీఆర్, సంజయ్, యాదవరెడ్డి, రాజశేఖర రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు వైఫల్యాలు, పింఛన్లు, మూడేళ్లుగా నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల నుంచి తప్పించుకోవడానికే ఈ దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలన వాస్తవాలు సభలో బట్టబయలవుతాయనే భయంతోనే తమపై పథకం ప్రకారం కుట్ర పన్ని సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ లేకుండా చేసి, బీజేపీ – కాంగ్రెస్ నామమాత్రపు చర్చలతో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం చేస్తున్నాయని హరీశ్‌రావు ఎండగట్టారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లిన ప్రతిపక్ష సభ్యులపై పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి వెయ్యి రోజులుగా పాలన సాగిస్తోందని, దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే తమపై ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో నిరసన తెలిపినట్లే తాము కూడా నిరసన తెలిపేందుకు యత్నించామని, తాము ఎలాంటి అన్‌పార్లమెంటరీ, నికృష్టమైన భాష మాట్లాడలేదని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రులుగా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అత్యంత అనుభవజ్ఞులు, సౌమ్యులైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం అంటూ కేటీఆర్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో ‘స్మాష్ ది పాట్రియార్కీ’ అంటూ మహిళా సాధికారతపై గొప్పలు చెప్తారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి రాకముందే మంత్రులుగా పనిచేసిన సీనియర్ మహిళా నేతల జుట్టు పట్టుకుని, గొంతు పిసికే ప్రయత్నం చేశారు’’ అని నిలదీశారు. పోలీసులు సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగుతుంటే… కోవ లక్ష్మి అడ్డుకోకపోయి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని, ఈ ఘటనతో సునీతమ్మ కంటనీరు పెట్టుకోవడం చూస్తే ఇది శాసనసభలా కాక దుశ్శాసన సభలా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీనియర్ నాయకురాళ్ల పట్ల జరిగిన ఈ దాడి, అనాగరిక ప్రవర్తన వెనుక స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర ఉందే తప్ప మరొకటి కాదని కేటీఆర్ ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు