– సభలో క్షమాపణ చెప్పే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
– వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడతామనే భయంతోనే దాడులు
– దాడికి నిరసనగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం బహిష్కరణ
– హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయిస్తాం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : శాసనసభ ప్రాంగణంలో మహిళా శాసన సభ్యులు, మాజీ మంత్రులు, సీనియర్ సభ్యులపై జరిగిన అక్రమ దాడి, దాష్టీకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముమ్మాటికీ బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం, జుట్టు లాగుతూ పోలీసులు దౌర్జన్యం చేయడం అత్యంత దుర్మార్గమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు, దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కుతో టీషర్టులు ధరించి సభకు వస్తే అడ్డుకున్నారని, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఇలాంటి నిరసనలు తెలిపినప్పుడు లేని నిబంధనలు రాష్ట్రంలో కొత్తగా వచ్చాయా అని నిలదీశారు.
వెయ్యి రోజుల వైఫల్యాల భయం
కాంగ్రెస్ వెయ్యి రోజుల భ్రష్ట పాలన, 420 హామీలు, 6 గ్యారెంటీల అమలు వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈ అరాచకానికి ఒడిగట్టిందని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు అనని మాటలను ఆపాదించి ప్రధాన అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
దళిత, మహిళా వ్యతిరేక ప్రభుత్వం
కాంగ్రెస్‌కు నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే అసెంబ్లీలో దళిత, గిరిజన డిక్లరేషన్లపై చర్చకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. దళితబంధును ఎత్తివేసి అభయహస్తం కింద రూ.12 లక్షలు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు ఇస్తామన్న హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.
న్యాయపోరాటం విస్తృతం
ప్రభుత్వ అరాచకాలకు నిరసనగానే బీఏసీ సమావేశాన్ని బహిష్కరించామని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. త్వరలోనే జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్‌ల దృష్టికి కూడా ఈ ఉదంతాన్ని తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





