ఇది బీఆర్‌ఎస్‌పై సస్పెన్షన్ కాదు

– ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్
– నియంతృత్వంతో ప్రజాస్వామ్యాన్ని అణచలేరు
– బీఆర్‌ఎస్‌ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కాదు.. ప్రజల సమస్యలపై చర్చ జరగాలి.. వాటికి పరిష్కారం చూపాలి అని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు అన్నారు. మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను ప్రజలు చూస్తున్నారు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఒక్క సమస్యపైనైనా చర్చ జరిగిందా.. ఒక్క ప్రభుత్వ విధానంపైనైనా సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని వేధించడం, గొంతు నొక్కడం, బయటకు పంపించడం తప్ప ప్రజల సమస్యలపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా తమను బలవంతంగా బయటకు పంపించడం అప్రజాస్వామికం అని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయని తెలిసి తమ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి అంటూ ఎన్నో వర్గాల ప్రజలు తమకు వినతిపత్రాలు ఇచ్చారు.. వారు ఎంతో ఆశగా ఫోన్లు చేస్తున్నారు.. మెసేజులు పెడుతున్నారు.. మా గొంతును అసెంబ్లీలో వినిపించండి అని ప్రజలు అడుగుతుంటే తాము బాధపడటం తప్ప ఏం చేయాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారని ఆర్టీసీ ఉద్యోగులు, నిషేధిత జాబితా నుంచి తమ భూములను ఎప్పుడు తొలగిస్తారని భూ యజమానులు అడుగుతున్నారు.. తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న జీవో 97ను ఎప్పుడు రద్దు చేస్తారని పాలిటెక్నిక్ విద్యార్థులు అడుగుతున్నారు.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.. డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.. కారుణ్య నియామకాల కోసం సింగరేణి ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.. పింఛన్ల పెంపు కోసం అవ్వాతాతలు ఎదురుచూస్తున్నారు.. ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తాయనే భయంతోనే ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సభ నుంచి బయటకు పంపింది అని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిలదీసే బీఆరఎస్ గొంతును సస్పెన్షన్ పేరుతో నొక్కాలని చూస్తున్నారన్నారు. కానీ రేవంత్ రెడ్డీ.. గుర్తుంచుకోండి.. ఇది ప్రతిపక్షంపై విధించిన సస్పెన్షన్ కాదు.. ఇది ప్రజా సమస్యలపై, ప్రజల గొంతుపై విధించిన సస్పెన్షన్ అని అన్నారు. మైకులు కట్ చేసో.. సస్పెన్షన్ విధించో అసెంబ్లీలో మా గొంతును అణచి వేయవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో చేయలేరు అని వ్యాఖ్యానించారు. ఎంత అణచివేస్తే అంత బలంగా ప్రజల తరఫున బీఆర్‌ఎస్ పోరాడుతుందని, నియంతృత్వంతో ప్రజాస్వామ్యాన్ని ఎక్కువ కాలం అణచివేయలేరని అన్నారు. హిట్లర్ తనకు ఆదర్శమని చెప్పుకున్న రేవంత్ రెడ్డి.. హిట్లర్ తరహా నియంతృత్వ ధోరణులతో పాలన సాగిస్తే చరిత్ర ఇచ్చే తీర్పు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. కేసీఆర్ పట్ల మీరు చేసిన అవమానాలు, వ్యక్తిగత దూషణలు, రాజకీయ కక్ష సాధింపులను సమాజం గమనిస్తోందని, ప్రజలే అంతిమ న్యాయమూర్తులు.. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారు అని అన్నారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పే వరకు బీఆర్‌ఎస్ వెనక్కి తగ్గదు.. నియంతృత్వం ఎంత పెరిగితే ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుందన్న విషయం గుర్తుంచుకోండి అని హరీష్‌రావు హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *