– ఇద్దరు మండలి సభ్యులు స్పీకర్‌ను అవమానించారు
– బీఆర్‌ఎస్ దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి
– గవర్నర్‌కు కాంగ్రెస్ సభ్యుల వినతిపత్రం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : బీఆర్‌ఎస్ శాసనమండలి సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా శాసనసభ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశారని, మరణించిన ఆయన తల్లిని ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించడం ద్వారా స్పీకర్‌ను తీవ్రంగా బాధించారని శాసనసభ, శాసనమండలిలోని కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది మొత్తం దళిత సమాజాన్ని రాష్ట్రంతోపాటు దేశంలోని మహిళలందరినీ అవమానించినట్లయిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా అత్యున్నత హోదాలో ఉన్న గవర్నర్ జోక్యం చేసుకుని శాసనసభ ప్రాంగణంలోనూ, వెలుపలనూ దళితులు, మహిళల గౌరవం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈనెల 8న జరిగిన ఘటనలు మన చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతాయన్నారు. శాసనసభ ప్రధాన ద్వారం వెలుపల మీడియా కెమెరాల సమక్షంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు తొలుత తన చొక్కాను విప్పారని, అనంతరం పలువురు ఇతరులు కూడా అదేవిధంగా చేసి పోలీసు సిబ్బందిపై చొక్కాలను విసిరారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది వైపు దూసుకెళ్లి వారిని తాకుతూ, అత్యంత అభ్యంతరకరంగా దగ్గరగా వెళ్లారన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ నేతృత్వంలో పలువురు నాయకులు పోలీసు సిబ్బందిపై, మహిళా పోలీసు అధికారులపైనా భౌతికంగా దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దళిత సమాజానికి చెందిన సభ్యులు శాంతియుతంగా, చట్టబద్ధంగా ఎర్రవల్లి వైపు ర్యాలీగా వెళ్లి బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు క్షమాపణ చెప్పాలని కోరిన నేపథ్యంలో కూడా బీఆర్‌ఎస్ అత్యంత దారుణమైన చర్యలకు పాల్పడిందని వారు ఆరోపించారు. దళిత సోదరులు, సోదరీమణులు నడిచిన రహదారులను పసుపు నీరు, పాలు చల్లి శుద్ధి చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనైతికమైన అంటరానితన ఆచరణను బీఆర్‌ఎస్ ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఈ మధ్యయుగ, భూస్వామ్య మనస్తత్వాన్ని ప్రతిబింబించే చర్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం బీఆర్‌ఎస్ నేతలు గర్వంగా ప్రచారం చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంటరానితనం సాధారణంగా ఉన్న చీకటి యుగంలోకి తెలంగాణతోపాటు భారత దేశాన్ని కూడా తిరిగి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. దళిత సమాజానికి వారి పదేళ్ల పాలనలో చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ నాయకులు వినతిపత్రంలో వివరించారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని విస్మరించడం, దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యను అనూహ్యంగా పదవి నుంచి తొలగించడం, మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని విస్మరించడం, దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్‌గా మార్చడం, అలాగే ఎస్సీ సబ్ ప్లాన్‌కు సంబంధించిన రూ.1,296 కోట్ల నిధులను ఖర్చు చేయకుండా మిగిల్చడం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాక బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై కూడా అత్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





