ఇన్సూరెన్స్ పేరుతో కోట్లలో బురిడీ

– ఆఫర్ల పేరిట ఆగ‌డాలు
– రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేయ‌డం
– ఐఆర్‌డీఏఐ లైసెన్స్ లేకుండా 20 మందితో నెట్‌వ‌ర్క్
– బాధితుల్లో రైతులు, కూలీలు, పోలీసులు కూడా
– విచార‌ణ జ‌ర‌పాల‌ని బాధితుల డిమాండ్‌
మహబూబ్ నగర్, ప్ర‌జాతంత్ర, సెంప్టెంబర్ 9 : ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులమని, తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికి అమాయక ప్రజల నుండి రూ.కోట్లలో వసూలు చేస్తూ నిలువునా ముంచుతున్న ఒక దందా వ్యవహారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. గత పదేళ్లుగా కంపెనీల పేర్లు, ఆఫీసుల చిరునామాలు మారుస్తూ ఒక ముఠా పద్ధతి ప్రకారం మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం ‘ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ఇన్సూరెన్స్ లైఫ్’ పేరుతో జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆఫీస్ ఏర్పాటు చేసి భారీగా డిపాజిట్లు, పాలసీలు కట్టించుకుని మోసం చేశారు. అప్పట్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, గొడవలు జరగడం సంచలనం సృష్టించింది. ఆ రగడ సర్దుమణగగానే అదే బృందం రూపం మార్చి ‘ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్’ పేరుతో మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. 5 సంవత్సరాలు చెల్లిస్తే చాలు.. 10 సంవత్సరాల పూర్తి బెనిఫిట్స్ వస్తాయి అని చదువురాని అమాయకులు, కూలీలు, రైతులను టార్గెట్ చేసి పాలసీలు కట్టించుకున్నారు. తీరా కొన్ని ఏళ్ల తర్వాత బాధితులు తమ పాలసీల స్థితి తెలుసుకోవడానికి పాత బస్టాండ్ సమీపంలోని ‘కోటా కాంప్లెక్స్’ ఆఫీస్‌కు వెళ్తే రాత్రికి రాత్రే ఆఫీసు ఖాళీ చేసి పారిపోయారు. ఫోన్ నంబర్లు కూడా మార్చేయడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆ తర్వాత విచారిస్తే తమ డబ్బులు హెచ్‌డీఎఫ్‌సీ కి వెళ్లాయని కొందరు చెబితే అక్కడికి వెళ్లి అడిగితే ఈ బాండ్లకు, మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆ సంస్థ చేతులెత్తేసింది. ఈ నిర్వాహకులు ఇప్పుడు మరో కొత్త రూపమెత్తినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్, ఫ్యూచర్ జెనరలి, అర్బన్ మనీ  ఇన్సూరెన్స్ పేర్లు వాడుకుంటూ మహబూబ్ నగర్ లోని ఎర్ర సత్యం చౌరస్తా సమీపంలోని ఒక భవనంలో ఎలాంటి బయటి బోర్డు లేకుండా ఆఫీస్ నడుపుతున్నారు.
పెట్రోల్ బంకులు, రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లు, ప్రముఖ ఆలయాల వద్ద ఫ్రీ టోకెన్లు పంపిణీ చేసి, ఆ తర్వాత ఫోన్లు చేసి మీకు లక్కీ డ్రాలో గిఫ్ట్ తగిలింది, ఆఫీసుకు రండి అని పిలిపిస్తున్నారు. ఆఫీసుకు రాగానే మాటల గారడీతో నమ్మించి బలవంతంగా కొత్త పాలసీలు చేయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. బాధితులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ కార్యాలయంలో మేనేజర్ సుదర్శన్, ఆఫ్రీన్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా ఒక టీమ్‌గా ఏర్పడ్డారు. ఇన్సూరెన్స్ నియంత్రణ మండలి  నిబంధనల ప్రకారం అధికారిక ఏజెంట్ కోడ్ కానీ, అర్హత పత్రాలు కానీ లేని దాదాపు 20మంది యువతీ యువకులను వీరు నియమించుకున్నారు. వారికి నెలకు ₹10,000 జీతంగా ఇస్తూ వారి ద్వారా ఉచిత కూపన్ల వల విసిరి అమాయక ప్రజలను కార్యాలయానికి పిలిపించి పాలసీల పేరిట సొమ్ము వసూలు చేయిస్తున్నారని సమాచారం. ఈ మాయమాటలు నమ్మి మోసపోయిన వారిలో నవాబ్‌పేటకు చెందిన నిరుపేద టైలర్ మహమ్మద్ సుభాన్, శివ అనే వ్యక్తులతో పాటు స్వయంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పలువురు పీసీలు కూడా ఉన్నట్లు బాధితులు తెలుపుతున్నారు. ఈ ఆరోపణలపై ప్రస్తుతం ఎర్ర సత్యం చౌరస్తాలోని ‘అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్’ మహబూబ్ నగర్ బ్రాంచ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న సుదర్శన్ ను ‘ప్రజాతంత్ర’ వివరణ కోరగా పలు విషయాలు వెల్లడించారు. కూపన్ల క్యాంపెయిన్ నిజమే. ఇన్సూరెన్స్ వ్యాపారం పెంచుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తాం, అందులో భాగంగానే దేవాలయాలు, మార్కెట్ల వద్ద ఉచిత కూపన్ల పేరిట క్యాంపెయిన్ నిర్వహించాం అని ఆయన తెలిపారు.   నిబంధనలకు విరుద్ధంగా కూపన్ల ద్వారా పిలిపించి పాలసీలు చేయడంపై ప్రశ్నించగా వ్యాపారం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తాం అని పేర్కొన్నారు.   అర్బన్ మనీ ఆఫీస్‌కు బయట కనీసం బోర్డు కూడా లేకుండా ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించగా పై అధికారుల నుంచి బోర్డు పెట్టమని ఆదేశాలు రాలేదు.. అందుకే పెట్టలేదు అని చెప్పారు. తమ వల్ల కొందరికి మంచి కూడా జరిగిందని అన్నారు. ఎలాంటి బోర్డులు లేకుండా, ఐఆర్‌డీఏఐ నిబంధనలను పక్కనబెట్టి అనాధికారిక వ్యక్తులతో ఇన్సూరెన్స్ వ్యాపారం నడుపుతున్న ఈ కార్యాలయంపై జిల్లా ఎస్పీ, విజిలెన్స్ అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే సుమోటోగా స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధితుల కష్టార్జితానికి న్యాయం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.
————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *