యూరియా యాప్‌ను రద్దు చేసే ప్రసక్తే లేదు

– పారదర్శకత, రైతులకు సబ్సిడీ అందించడమే ప్రభుత్వ లక్ష్యం
– రాష్ట్రం ఆదర్శంగా కేంద్రం తీసుకొచ్చిన ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్‌
– కౌలు రైతుల ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు
– వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9 : పారదర్శకంగా రైతులకుసబ్సిడీ ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్’ ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే ప్రసక్తి లేదని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితర సభ్యులు బుధవారం అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. యాప్ అమలులో ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమించి రైతులకు మరింత సులభంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గతంలో ఆధార్ ద్వారా ఎరువుల పంపిణీ జరిగేదని, అయితే వాస్తవంగా సాగు చేసే రైతులకే సబ్సిడీ ఎరువులు చేరాలన్న ఉద్దేశంతో ఈ యాప్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. ఎరువుల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, పరిశ్రమలకు మళ్లింపు వంటి వాటికి చెక్ పెట్టి పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యాప్ ద్వారా ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా రైతులు ఎరువులు కొనుగోలు చేశారని ఆయన సభ దృష్టికి తెచ్చారు.

కేంద్రమూ అమలు చేస్తున్నది

తెలంగాణ ప్రభుత్వం రబీ 2025-26 లో తెచ్చిన యూరియా బుకింగ్ యాప్ విజయవంతం కావడంతో దీన్ని ఆదర్శంగా తీసుకున్న కేంద్రం దేశవ్యాప్తంగా ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌ (ఎఫ్ఎఫ్ఎస్‌) యాప్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి తుమ్మల తెలిపారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా గత వారం నుంచే అమలు చేస్తున్నామన్నారు. ప్రారంభ దశలో ఉన్న కొన్ని సాంకేతిక సమస్యలను కేంద్ర సాంకేతిక బృందం సహకారంతో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. సర్వర్ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. స్మార్ట్‌ ఫోన్ లేని రైతులు కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ), మీ-సేవ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. గతంలో కమ్యూనికేషన్, రవాణా సదుపాయాలు లేని సమయంలో ప్రభుత్వం సొసైటీలకు రవాణా ఛార్జీలు భరించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారడంతో ఆ విధానాన్ని ఉపసంహరించుకున్నామని మంత్రి చెప్పారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ఎరువుల విక్రయ కేంద్రాలు, డీలర్లు, సొసైటీల వద్ద ఒకే ధరకు యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. అలాగే కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఇస్తూ కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించకపోవడంతో రైతులు కేవలం యూరియా వైపు మొగ్గు చూపుతున్నారని తుమ్మల అన్నారు. దీని వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటోందని, ఎరువుల ధరలను క్రమబద్ధీకరించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరినట్లు తెలిపారు. యుద్ధ పరిస్థితుల కారణంగా దిగుమతుల్లో కొంత ఆలస్యమైనా రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, గతంలో 16-17 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉంటే ఇప్పుడు వాటిని 22-23 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని మంత్రి వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *