– అందుకే రాష్ట్రాల్లో 50 శాతం పెంపు
– బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: జనాభా ప్రకారమైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం తెచ్చారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టాలు చేసిందన్నారు. 1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల ఏపీకి ఒక లోక్‌సభ సీటు తగ్గిందని తెలిపారు. ప్రస్తుత సీట్ల ప్రకారమైతే మహిళలకు 170 మాత్రమే వచ్చే అవకాశం ఉందని, సీట్లు పెంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే 270కిపైగా సీట్లు వస్తాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైబ్రిడ్ పాలసీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా అవి పెరుగుతాయని తెలిపారు. మోదీకి పెరుగుతున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. అందుకే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నది ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఓటు విలువ ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా ఉంటుందని తెలియదా అని ప్రశ్నించారు. జీడీపీలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని గుర్తు చేశారు. మహిళల అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారంటూ విపక్షాల తీరుపై మండిపడ్డారు. మహిళల వాటా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని ఇది సరికాదని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




