– రాజ్యాంగం నిర్దేశించింది కూడా ఇదే
– సీఎం రేవంత్ గందరగోళ వ్యాఖ్యలు తగవు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు విమర్శించారు. వరంగల్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన పక్రియ అని స్పష్టం చేశారు. సీట్ల పెంపు అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల్లో గందరగోళం సృష్టించేలా మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ సిస్టమ్ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. డీలిమిటేషన్‌కు సంబంధించి రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని, అవేవీ చట్టబద్ధమైనవి కావని కొట్టిపారేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇండి కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని రామచందర్‌రావు హితవు పలికారు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పక్రియపై చర్చ జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కేవలం కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడానికేనన్నారు.
మహిళలకు మోదీ అతిపెద్ద కానుక
ప్రధాని మోదీ సుపరిపాలనలో వరంగల్‌లో మునుపెన్నడూ చూడని అపూర్వమైన అభివృద్ధి జరుగుతోందని రామచందర్Šరావు అన్నారు. ’అమృత్ భారత్ స్టేషన’ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ జరుగుతోందన్నారు. ’పీఎం మిత్ర’ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కానున్నదన్నారు. మహిళా రాజకీయ సాధికారతకు బాటలు వేస్తూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన చారిత్రాత్మక ’నారీ శక్తి వందన్ అధినియం’ పట్ల వరంగల్ ప్రజలు అమితమైన హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వరంగల్‌లోని నారీమణులతో కలిసి చరిత్రాత్మక ’నారీ శక్తి వందన్ అధినియం’ విజయోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం నవ భారత రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చబోతున్న ఒక సువర్ణాధ్యాయం అని అన్నారు. కాగా, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీధి విక్రయదారులకు టీ స్టాల్స్ పంపిణీ చేశారు. పట్టణ ఆర్థిక వ్యవస్థలో, ప్రజలకు నిత్యావసరాలను వారి ముంగిటకే చేరువ చేయడంలో వీధి విక్రయదారుల పాత్ర అత్యంత కీలకమన్నారు. వీరి కష్టాన్ని గుర్తించిన మోదీ పీఎం స్వనిధి పథకం ద్వారా వారి జీవనోపాధికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. వరంగల్ విచ్చేసిన రామచందర్‌రావుకు కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రతి బీజేపీ కార్యకర్త హృదయంలో వరంగల్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




