కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి..!

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నది వ్యవసాయం  కానీ, వ్యవసాయం  చేస్తున్న  రైతులో మెజారిటీ  “కౌలు రైతులు” మాత్రం నేటికీ అక్షరాలా “అదృశ్య సాగుదారులు”గానే మిగిలిపోయారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు (మొత్తం సాగుదారులలో 36 శాతం) నేలతల్లిని నమ్ముకుని చెమటోడుస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారి ఉనికి శూన్యం. 28 నెలల కిందట అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ‘ఆరు గ్యారంటీలలో’ కౌలు రైతులకు భరోసా ఇస్తామని వాగ్దానం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారకపోవడం విచారకరం. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు  పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఇది లక్షలాది మంది సాగుదారులలో ఆశలు చిగురింపజేసింది. అయితే, అధికారంలోకి వొచ్చి రెండేళ్లు దాటినా, ఈ పథకం అమలుకు షురూవాత్  “కౌలు రైతుల గుర్తింపు” ప్రక్రియ ప్రారంభం కాలేదు.

2011 నాటి ‘ఆంధ్రప్రదేశ్ భూ అధీకృత సాగుదారుల చట్టం’ (తెలంగాణకు వర్తిస్తుంది) ప్రకారం కౌలు రైతులకు “LEC (Loan Eligibility Cards)” కార్డులు మంజూరు చేయాలి. ఈ కార్డు ఉంటేనే రైతుకు బ్యాంకు రుణాలు, పంట బీమా, పెట్టుబడి సాయం వంటివి అందుతాయి. కానీ, వోటు బ్యాంకు రాజకీయాల్లో నలిగిపోతున్న ఈ వ్యవస్థలో, భూయజమానుల ఆగ్రహానికి గురికావాల్సి వొస్తుందనే భయంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయడానికి వెనుకాడుతోంది.

ఒక కౌలు రైతు సాగు చేసే క్రమంలో మూడు ప్రధాన అడ్డంకులను ఎదుర్కొంటున్నాడు..మొదటిది పెట్టుబడి కష్టం:. ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా భూ యజమానుల ఖాతాల్లోకి వెళ్తుంది. కౌలు రైతు మాత్రం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద 36% నుండి 60% వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నాడు.రెండవది “ప్రకృతి వైపరీత్యాలు.. అకాల వర్షాలు, కరువు వొచ్చినప్పుడు పంట దెబ్బతింటే వొచ్చే నష్టపరిహారం పట్టాదారుడికే అందుతుంది. కష్టపడి పంట పండించిన కౌలు రైతుకు ఆఖరుకు  మిగిలేది కన్నీరు, అప్పుల కుప్పే..! మూడవది మార్కెటింగ్ సమస్యలు.. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు పట్టాదారు పాస్ బుక్ అడుగుతోంది. దీనివల్ల కౌలు రైతు తన పంటను దలారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వొస్తోంది.

2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు కార్డులు ఇవ్వడం వల్ల భూయజమాని హక్కులకు ఎటువంటి భంగం కలగదు. ఇది కేవలం సాగు హక్కును గుర్తించడం మాత్రమేనని చట్టం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, భూస్వాముల ఒత్తిడి లేదా రికార్డుల గందరగోళం వల్ల రెవెన్యూ యంత్రాంగం ఈ దిశగా అడుగులు వేయడం లేదు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టింది, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడవడం తెలంగాణ వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టు.

    కౌలు రైతుల సంక్షేమం కేవలం మానవీయ కోణం మాత్రమే కాదు, అది రాష్ట్ర ఆహార భద్రతతో ముడిపడి ఉన్న అంశం. ప్రభుత్వం ఈ క్రింది చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. గ్రామ సభల ద్వారా పారదర్శకంగా సాగుదారులను గుర్తించి, రైతు భరోసా స్కీమ్ లో భాగంగా 2011 చట్టం ప్రకారం ఎల్ఈసీ కార్డులు పంపిణీ చేయాలి. కౌలు గుర్తింపు కార్డు వల్ల భూమిపై హక్కులు మారవని భూయజమానులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే చట్టానికి చిన్నపాటి సవరణలు చేసి వారి భయాందోళనలను తొలగించాలి. కార్డు పొందిన ప్రతి కౌలు రైతుకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందేలా చూడాలి. సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందాలనే సూత్రాన్ని అమలు చేయాలి. కౌలు రైతులకు ప్రత్యేకంగా రూ.15 వేల  సాయాన్ని వెంటనే విడుదల చేయాలి.

రాష్ట్రంలో  రైతు ఆత్మహత్యల గణాంకాలను పరిశీలిస్తే, అందులో 75 శాతం పైగా కౌలు రైతులే ఉండటం అత్యంత విషాదకరం. “అన్నదాత” అని పిలుచుకునే నోటితోనే, వారిని గుర్తింపు లేని కూలీలుగా చూడటం నాగరిక సమాజానికి తగదు. ప్రభుత్వం తన ఆరు గ్యారంటీలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, 22 లక్షల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలి.”నేల నీది కాకపోవచ్చు.. కానీ స్వేదం నీది, శ్రమ నీది” అని కౌలు రైతుకు భరోసా ఇచ్చినప్పుడే తెలంగాణా వ్యవసాయం సుభిక్షంగా మారుతుంది. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా, 2011 చట్టాన్ని అమలు చేసి, కౌలు రైతును సాగుదారుడిగా గుర్తించడమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *