– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 25 : ఎన్నికల జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ ) ప్రక్రియ అనేది కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన కార్యక్రమం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితాలో పారదర్శకత, స్పష్టత, విశ్వసనీయత ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపడుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను విడతల వారీగా చేపడుతున్నదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికల జాబితాను సవరించి ఈ జాబితాను పూర్తిగా అప్‌డేట్ చేస్తున్నారన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ విజయవంతంగా ‘సర్’ ప్రక్రియ పూర్తయిందన్నారు. గురువారం నుంచి తెలంగాణలోనూ ప్రారంభమైన నేపథ్యంలో దీన్ని రాష్ట్ర ఓటర్ల జాబితా సంస్కరణ ప్రక్రియగా చూడాలే తప్ప రాజకీయ కోణంలో కాదని సూచించారు. కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు ఏదో జరిగిపోతోందంటూ రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరికాదన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా అప్‌డేట్ చేసేందుకు జరిగే ప్రక్రియలకు బీజేపీ ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అర్హుడైన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉండాలంటూ అదే సమయంలో అక్రమ, నకిలీ, డూప్లికేట్ పేర్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు.. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక్క డూప్లికేట్ ఓటు, ఒక్క నకిలీ ఓటు కూడా కొత్త జాబితాలో ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కిషన్‌రెడ్డి కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





