ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

– సెబీ, ఎన్‌ఎస్‌ఈ ఆధ్వర్యంలో పోలీస్ అకాడమీలో ట్రైనీలకు సెమినార్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం, రిస్క్‌లను అంచనా వేసుకోవడం, చట్టబద్ధమైన మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరమని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్మోహన్ సూచించారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో ట్రైనీ అధికారులు, ఫ్యాకల్టీ సభ్యులు, అకాడమీ సిబ్బందికి స్టాక్ మార్కెట్‌పై అవగాహన, పెట్టుబడి మోసాల నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఆధ్వర్యంలో సంయుక్తంగా రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్‌ను గురువారం నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ఆదేశాల మేరకు ట్రైనీ అధికారుల కోసం ఏర్పాటు చేసిన ఈ సెమినార్‌కు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.ఆర్.కె.ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి జీవితంలో ఆర్థిక ప్రణాళికకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ప్రస్తుతం గూగుల్, మెటా వంటి డిజిటల్ వేదికలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఉపయోగించి అనేక నకిలీ పెట్టుబడి పథకాలు, మోసపూరిత ప్రకటనలు ప్రచారంలోకి వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలను అరికట్టడంలో ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత ప్రభావవంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈ రీజినల్ మేనేజర్ రవి ఉప్పే మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా అవసరం, వాటి నిర్వహణ, పెట్టుబడి ప్రక్రియపై సవివరంగా వివరించారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, పంప్ అండ్ డంప్ స్కామ్‌లు, డబ్బా ట్రేడింగ్, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, అనధికారిక పెట్టుబడి సలహాల వల్ల పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న మోసాల గురించి ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఎనఎసఈ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, నివారణ చర్యలను వివరించారు. పెట్టుబడిదారుల కోసం రూపొందించిన అతి సాయి సాథి యాప్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడి సంబంధిత సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలపై ట్రైనీలకు సమగ్ర అవగాహన కల్పించారు. లైజన్ ఆఫీసర్ డీఎస్పీ ఆదూరి శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనీ డీఎస్పీలు, అకాడమీ సిబ్బంది, సెబీ, ఎనఎసఈ ప్రతినిధులు, కార్యక్రమానికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్, కంపెనీ సెక్రటరీ అభిలాష్ దరాక్, అకాడమీ ఔట్‌డోర్ ఏడీ రాంబాబు, డీఎస్పీలు సతీష్ కుమార్, తిరుపతి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మహేష్, శ్రీను, ప్రవీణ్, నహేర్, ట్రైనీ డీఎస్పీలు, ఫ్యాకల్టీ సభ్యులు, కార్యాలయ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *