– వైఫల్యాలు, అవినీతి కప్పిపుచ్చుకునేందుకే ఇరు పార్టీల నాటకాలు
– ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపిస్తున్న రేవంత్ రెడ్డి పాలన
– కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లపై డాక్టర్ లక్ష్మణ్ ఫైర్
న్యూఢిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: శాసనసభలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీధి నాటకాలకు తెరతీశాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి బట్టబయలు కాకుండా రెండు పార్టీలు కుమ్మక్కై ‘డూప్ ఫైటింగ్’ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని లక్ష్మణ్ మండిపడ్డారు. రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారిందని, ఎటువంటి విచారణ లేకుండా దాదాపు కోటి ఎకరాలను 22/A నిషేధిత జాబితాలో చేర్చి దందాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు చేస్తూ ఆ డబ్బును ఢిల్లీకి కప్పంగా పంపుతున్నారని విమర్శించారు.
నిరంకుశ పాలన.. రాజ్యాంగానికి అవమానం
ప్రశ్నించే బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అణచివేస్తున్న రేవంత్ పాలన.. ఇందిరమ్మ ఎమర్జెన్సీని, మమతా బెనర్జీ నిరంకుశత్వాన్ని తలపిస్తోందని విమర్శించారు. బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం కావడం ప్రజాతీర్పును, రాజ్యాంగాన్ని అవమానించడమేనని దుయ్యబట్టారు.
బహిరంగ చర్చకు సిద్ధం
ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. పదేళ్ల మోదీ ప్రభుత్వమే తెలంగాణకు అత్యధికంగా నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో రైల్వే బడ్జెట్ కింద కేవలం రూ. 886 కోట్లు ఇస్తే, మోదీ సర్కార్ రూ. 5,500 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. వందే భారత్ రైళ్లు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్, గిరిజన వర్సిటీ, రామగుండం ఎరువుల కర్మాగారం వంటివి కేంద్రం ఇచ్చిందేనని తెలిపారు. ఈ అంశాలపై అసెంబ్లీలోనైనా, బహిరంగ వేదికపైనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాబోయే జమిలి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





