యుక్తవయసు బాలలతో మెలిగే
నైపుణ్యాలను వ్యవస్థలు,తల్లిదండ్రులు ఉపా ధ్యాయులు మెరుగు పరచుకోవాలి…
ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ షో ‘Adolescence’ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ షోలో, తన తో పాటు చదువుకుంటున్న బాలికను హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 ఏళ్ల బాలుడి కథను ప్రదర్శించారు. ఈ సంఘటన అతని కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిన విధానం హృదయ విదారకంగా ఉంటుంది.
ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ బాలుడు సగటు సాధారణ కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నవాడు. చెడు అలవాట్లు ఉన్న తల్లిదండ్రుల కుటుంబం కాదు. యవ్వన దశలో పెద్దలు తల్లిదండ్రులు టీచర్లు మెలగవలసిన నైపుణ్యతలతో మేలుగుతున్నామ అనే ప్రశ్నలు వెంటాడుతాయి. సోషల్ మీడియా లో వాళ్ళు గడుపుతున్న సమయం వారి స్నేహ బృందం తో మాట్లాడే కోడ్ భాష అన్నీ పెద్దలకు అర్ధం కానీ ప్రపంచం. ఈ సీరియల్ యుకె దేశస్థులను దృష్టిలో ఉంచుకుని తీసిన సీరియల్. కానీ ప్రపంచ వ్యాప్తంగా స్పందన చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. మరి ముఖ్యంగా భారత దేశం నుండి వచ్చిన స్పందనకు నమ్మలేకపోయారు. యుక్త వయసు సమస్యలు సార్వత్రికం అని తేలిపోయింది. ఈ సీరియల్ నుండి యౌవాన దశ గురుంచి చర్చించే అవకాశం ఏర్పడింది.
యౌవనదశ పిల్లల కోసం ఒక క్లిష్టమైన దశగా మారవచ్చు, ఎందుకంటే వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పెద్దవారిగా మారేందుకు సిద్ధమవుతున్న దశ. నేటి కాలంలో, సామాజిక మాధ్యమాల వల్ల ఈ సంక్లిష్టత మరింత పెరిగింది, దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసిద్ధి చెందిన adolescence షో స్పష్టంగా చూపించింది.
తల్లిదండ్రులు, టీచర్లు, పెద్దల పాత్ర చాలా ముఖ్యం. నిబంధనలను మాత్రమే విధించడం కంటే, పిల్లలకు నచ్చజెప్పడం చాలా ముఖ్యం. వారికి తగిన మార్గనిర్దేశనం, మానసిక మద్దతు అందించడం ఎంతో అవసరం. మార్గదర్శకులు కావాలి, పర్యవేక్షకులు కాదు! యుక్త వయసులో ఉన్న యువతి యువకులు ఏదో ఒక సందర్భంలో తమ కార్యకలాపాల పట్ల గోప్యతా కనబరుస్తారు. అర్థవంతమైన సంభాషణల ద్వారా వారికి మార్గనిర్దేశం చేయగలిగితే, వారు భద్రంగా మరియు బాధ్యతాయుతంగా మేలుగుతారు.
కావున, తల్లిదండ్రులు టీచర్లు పెద్దలు అప్రమత్తంగా ఉండి, సరైన హద్దులను ఏర్పాటు చేసి, సరైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వగలిగితే, పిల్లలు సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించగలరు.యౌవనదశ అనేది శారీరక మానసిక అభివృద్ధి జరిగే ఒక కీలక దశ. ఇది సాధారణంగా 10 నుండి 19 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఈ దశ చిన్నతనం మరియు పెద్దదనం మధ్య ఉండే ఒక మార్పు స్థితి.
యౌవనదశ భావోద్వేగ తుఫాన్ల కాలం. తరచుగా కోపంతో ప్రవర్తించడం, త్వరగా శాంతించ లేకపోవడం, శారీరక హింస, ప్రతిఘటన, అభిప్రాయాలను వ్యక్తీకరించడంలో తీవ్రంగా ఇబ్బంది పడటం మొదలగు లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు ఒంటరిగా మారిపోవడం, స్వీయ హాని చేసుకోవడం లేదా ప్రమాదకరమైన చర్యలకు పాల్పడడం ద్వారా తమ అసహనాన్ని వెలిబుచ్చుతారు. అయితే పెద్దలు ఈ పరిస్తుతులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా సందర్భాలలో పిల్లలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నమే కనిపిస్తుంది. యుక్తవయసు పిల్లలతో మెలగడం వారితో సంభాషించడం ఒక నైపుణ్యతవ కూడుకున్న విషయం.
Netflix సీరియల్ అడోలసెన్స్ ప్రపంచ వ్యాప్తంగా యుక్త వయసు యువతి యువకుల స్థితిగతులపై వారి ప్రవర్తనపై సోషల్ మీడియా ప్రభావం పై పెద్ద చర్చ కు తెర లేపింది. నిత్యం మన చుట్టూ జరిగే సంఘటనల మీద అంత స్పందన కనపడదు మన సమాజం లో. సినిమాలో ,సీరియల్స్ లో లేదా నిర్భయ లాంటి సంఘటలతో సమాజం ఉలిక్కిపడుతుంది. మన మద్య జరిగిన అటువంటి సంఘటన వివరించాలని ఉంది.
నవోదయ పాఠశాల నుండి వెలి వేసిన యుక్త వయసు విద్యార్థుల గాధ:
ఈ సీరియల్ చూసిన తరువాత 2023 వ సంవత్సరం లో తెలంగాణ లో నవోదయ విద్యాలయం 15, 16 సంవత్సరాల యువకుల మీద తీసుకున్నఅనాలోచిత చర్య తో విద్యార్థులు అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతం. కుటుంబాల సహాయం ఉన్న వారు ఏదో రకంగా ఈ సంక్షోభం నుండి బయట బడి తమ విద్యను కొనసాగిస్తున్నారు. కానీ జోసెఫ్ అనే విద్యార్థి జీవితం లో చేసిన ఆ గాయం ఇంకా మానలేదు.
జోసఫ్ వనపర్తి జిల్లాలలో జన్మించిన పేద దళిత విద్యార్థి. చెల్లాచెదరైన కటుంబ నేపథ్యం. తల్లి కి ఎలాగైనా జోసెఫ్ ఈ అల్లకల్లోల పరిస్థితి నుండి తప్పించి బాగా చదివించాలనే తపన. ప్రాథమిక విద్య ను అభ్యసిస్తున్న దశలో జోసెఫ్ ను వాళ్ళ అమ్మ నవోదయ ఎంట్రెన్స్ కు సంసిద్దం చేసే ఒక సంస్థలో చేర్పించి తన సంపాదన అంతా ఆ కోచింగ్ సెంటర్ కు చెల్లించేది. జోసెఫ్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ పాస్ అయ్యాడు. మహబూబ్ నగర్ నవోదయ విద్యాలయం లో సీటు సంపాదించాడు. 10వ తరగతి వరకు అక్కడే చదువును కొనసాగించి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తాను చదివిన నవోదయ లో పదకొండవ తరగతి లో లేనందువలన పాఠశాల విద్యార్థులను జవహర్ నవోదయ విద్యాలయ (JNV), గోపనపల్లె, రంగారెడ్డి జిల్లా లో నమోదు చేశారు.
ఒక సంవత్సరం పాటు హాయిగా పదకొండవ తరగతి పరీక్షలు అయిపోయాక సంతోషంగా గంతులేస్తూ విద్యార్థులందరు తమ తమ ఇళ్లలోకి వెళ్లారు. ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. 11 వ తరగతి పాసై 12 వ తరగతి లోకి అడుగుపెట్టేందుకు తమ తమ ఇళ్ళనుండి స్కూల్ కు తిరుగు ప్రయాణానికి సన్నద్దం అవుతుండగా పిడిగు లాంటి వార్త విన్నారు. పాఠశాలకు రావద్దని విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)లు జారీ చేయడం జరిగినది. ఈ TCలతో పాటు ప్రోగ్రెస్ రిపోర్ట్‌లను 8 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు/గార్డియన్లకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపారు. అందులో జోసెఫ్ కూడా ఒకడు. కారణం చూపకుండా ఏకంగా టీసీ లు ఇచ్చి పంపడం తో తల్లిదండ్రులు అందరూ చాలా దుఖం లో మునిగి పోయారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ ను ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అభ్యర్థించారు మరియు తమ పిల్లల తరఫున క్షమాపణ చెప్పారు. పాఠశాల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం తో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC)ని ఆశ్రయించారు. కలెక్టర్ ను సంప్రదించారు. ప్రతిపక్ష నాయకులను కలిశారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిని కలిశారు, కుల సంఘాలను కలిశారు. వివిధ రాజకీయ పార్టీ పెద్దలను కలిశారు. తిరగని చోటులేదు. అయినా వారి బాధను వినే వారు కానీ పరిష్కారం చూపే వాలు కానీ కనిపించలేదు. వీరితో పాటు నేను కూడా తిరిగాను కొంత మంది దగ్గరకు. తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తికి స్పందనగా, నవోదయ విద్యాలయ హైదరాబాద్ ప్రాంతం డిప్యూటీ కమిషనర్ ఒక తప్పుడు ఏకపక్ష నివేదికను అందించారు.
ఈ నివేదికలో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉండటం,పాఠశాల క్యాంపస్‌ను వదిలి వెళ్లడం, అశ్లీల వీడియోలు కలిగి ఉండటం, మోటార్‌బైక్ దహనం చేయడం, ఆడియో రికార్డింగ్ చేయడం, సంవత్సరాంత పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీయడం లాంటి ఆరోపణలు చేస్తూ ఒక నివేదిక తయారుచేశారు.ఈ ఆరోపణల ఆధారంగా టీసీ లు జారీ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.
అసలు జరిగిన సంఘటన:
ఈ విషయమంతా ఒక మిత్రుడు నా వద్దకు తీసుకొచ్చి సహాయం కోరాడు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులతో మాట్లాడాలని వారిని ఒక్కొక్కరిని కలవడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడిన వివరాల ప్రకారం, 2022 జనవరిలో ప్రిన్సిపాల్, జోసెఫ్ అనే విద్యార్థిని కొట్టారు. అప్పటికి ప్రిన్సిపాల్ మద్యం సేవించి ఉన్నారు. ఈ ఘటనను గమనించిన 200-300 మంది విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా సమ్మె చేశారు మరియు డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.దీనికి ప్రతిస్పందనగా, ప్రిన్సిపాల్ మరియు కొంత మంది సిబ్బంది విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. అయితే, అప్పటి నుండి విద్యార్థులపై కక్ష పెంచుకుని, వారిని వేధించే అవకాశాలను వెతుకుతున్నారు.
ఈ ఎనిమిది మంది విద్యార్థుల్లో చాలా మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు. వారు ప్రతిభావంతులు. వారిలో ఒకరు జాతీయ స్థాయి అథ్లెట్. ఈ అన్యాయ నిర్ణయం విద్యార్థులను పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసింది. నేను మాట్లాడిన కొంత మంది చాలా బాధ తో కోపం తో ఊగిపోయే వారు. మాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు అనే ఆందోళన కోపం ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు కూడా. ఒక విద్యార్థి ఎవ్వరూ స్పందించక పోవడం తో రోహిత్ వేముల లాగా అయితేనే స్పందిస్తారు అనే వాడు. పిల్లలు ఏమైనా చేసుకుంటారో ఏమో అని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపలా కాశారు. ఒక విద్యార్థి తల్లి ఇళ్ళలో పని చేసే గృహ కార్మికురాలు. తండ్రి ఆటో డ్రైవర్. ఇలా అందరూ తొలి తరం విద్యార్థులు వీళ్ళ మీద ఇంత దౌర్జన్యం.
జోసెఫ్ కోసం తిరగని గడప లేదు ఆడగని వ్యక్తి లేరు. జోసెఫ్ కు చివరకు గురుకుల స్కూల్ లో సీటు ఇప్పించారు. కానీ ఒక కండిషన్. అదేంటంటే జోసెఫ్ ఇంటర్ మొదటి సంవత్సరం నుండి మొదలు పెట్టాలని. జోసెఫ్ ఒప్పుకుని రెసిడెన్షియల్ గురుకుల కాలేజీ లో చేరాడు. మానని గాయం తో పట్టుదలతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ విద్యార్థులందరిని ఒక సారి కలవాలని ఉంది ఎప్పుడైనా ఒక సారి.
చివరగా :
పాఠశాలలో ఇళ్ళలో పిల్లలు తన భావోద్వేగాలను స్వేచ్ఛగా చెప్పేందుకు ప్రోత్సహించాలి. పిల్లలు ఎలాంటి భయం లేకుండా తన భావోద్వేగాలను వ్యక్తం చేయగల వాతావరణం కల్పించాలి. పిల్లలు తమ భావోద్వేగాలను అర్థం చేసుకుంటూనే, అవి తగిన పరిమితులలో ఉండేలా మార్గనిర్దేశం చేయాలి. అంతే కానీ మా అప్పుడు ఇలా కాదు అనే ఉపన్యాసాల ద్వారా మానసిక శారీరక శిక్షల ద్వారా పది మందిలో అవమానించడం ద్వారా క్రమ శిక్షణ లో పెడుతామనుకోవడం ఈ తరం పిల్లలకు ఏ మాత్రం ఉపయోగపడక పోగా మనకు లోక జ్ఞానం చాలా తక్కువ తెలుసని అనుకుంటారు. భౌతిక ప్రపంచం మరియు వర్చువల్ అనే రెండు ప్రపంచాల మధ్య జీవిస్తున్న యవ్వన ప్రపంచానికికి తోడుగా ఉండే నైపుణ్యతలను పెంచుకుని యువతి యువకులతో మెలిగితే పెద్దలుగా యువ ప్రపంచాన్ని ఆదుకున్న వారమవుతాము.

ఆర్.వెంకట్ రెడ్డి
జాతీయ కన్వీనర్,
ఎమ్ వీ ఫౌండేషన్





