– చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
– కిటకిటలాడిన కాళేశ్వరం
– పుష్కర స్నానమాచరించిన మంత్రులు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 1 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా సాగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాలలో భాగంగా చివరి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. సరస్వతి ఘాటు వద్ద త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో పూజలు చేశారు.
మంత్రుల పుష్కర స్నానం 

మంత్రులు గడ్డం వివేక్, లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ తో కలిసి గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ఈ పవిత్ర స్థలంలో ప్రజలందరు పుష్కర స్నానాలు ఆచరించారని తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం దేవుని ఆశీర్వాదం అందరికీ లభించాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను వచ్చే సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించిందని తెలిపారు. ఇందుకోసం సుమారు రూ. 1000 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గోదావరి పరివాహక జిల్లాలలో విస్తృతంగా ఏర్పాట్లు చేయడంతోపాటు, గోదావరి ప్రవహిస్తున్న జిల్లాల్లో కూడా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. దేవాలయం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారని తెలిపారు. అలాగే బాసర దేవాలయ అభివృద్ధికి రూ.170 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించామని, గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే అన్ని పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొదటి విడత నిధులు ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ గోదావరి–ప్రాణహిత– ఆంతర్వాహిని సరస్వతి త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఎంతో పవిత్రమని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు దేవుని ఆశీస్సులు అందరికీ లభించాలని కోరారు. ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సరస్వతి మాత, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని కోరుతూ పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, అర్చకులు మంత్రులు, ఎంపీకి అమ్మవారి జ్ఞాపిక, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




