అభివృద్ధి పథంలో ఆదిలాబాద్

– అదే మా సంకల్పం

– పార్టీతో సంబంధం లేకుండా గూడేల్లో ఇండ్లు మంజూరు
– కాగజ్‌నగర్ బహిరంగ సభలో సీఎం రేవంత్

కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 1 : ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన, ఆదివాసీ బిడ్డలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగజ్‌నగర్‌లో జరిగిన ప్రజాపాలన-ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వాలని అడవి బిడ్డలు వచ్చి తనను కోరారని, వెంటనే నియోజకవర్గానికి 3500 ఇండ్లతోపాటు ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా 21 వేల ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను నేను చూడదలచుకున్నానంటూ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ గిరిజన గూడేల్లో ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. గూడేల్లో అవసరమైన ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విడుదలలో ఒక్క రోజుకూడా జాప్యం చేయలేదని, ఏడాదిలో లక్ష ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేసుకున్నామని, సెప్టెంబరు 17న మరో లక్ష ఇండ్లకు గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశిస్తున్నానని అన్నారు. రెండో విడతలో భాగంగా మరో 2.50 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఇండ్లు లేని వారి లిస్టు తయారు చేసి ఇవ్వండి.. ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది అని సీఎం చెప్పారు. కాళేశ్వరం కట్టడం అది కూలేశ్వరం కావడం జరిగిపోయింది.. కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క ఎకరా నీళ్లు రాలేదు.. అందుకే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పారు. అయితే ఆయన స్పందించడం లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనై కదులుతుంది.. రైతులు ఉప్పెనై కదిలితే మహారాష్ట్రకు ఇబ్బందులు తప్పవు.. మా బాధను, అవసరాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారని, లక్షలాదిమంది రైతుల పక్షాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలని కోరారు. తనకు ఎలాంటి భేషజాలు లేవు.. అవసరమైతే మీ ఇంటికి రావడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి సహకరించండి అని కోరారు. పోలవరం కోసం ఏడు మండలాలను ఇచ్చిన మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి రెండువేల ఎకరాలు ఇప్పించలేరా అని ప్రశ్నించారు. మేం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నాం.. కిషన్ రెడ్డి గారూ.. మీ ఆలోచనేంటో మాకు తెలియడం లేదు.. మీ ఆలోచనేంటో ముందు బయటపెట్టండి అని అడిగారు. రైతు ప్రయోజనాల కోసం మోదీ అయినా.. కిషన్ రెడ్డి అయినా ఎవరినీ లెక్కచేయను ఐ డోంట్ కేర్ ఎనీ వన్.. నాకు రైతుల ప్రయోజనమే ముఖ్యం.. అని స్పష్టం చేశారు. 75 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని తమ ప్రభుత్వం సేకరించిందని, ఈ ధాన్యాన్ని కొనడానికి కేంద్రం ముందుకు రావడంలేదని, కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం వడ్లు, మక్కలు ఒక్క గింజ కొనడం లేదని విమర్శించారు. తెలంగాణ సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యం, మక్కలన కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇందుకు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలన్నారు. ఆయన బాధ్యత తీసుకోకుంటే 15న ఆ ధాన్యం తీసుకొచ్చి మీ ఇండ్ల ముందు పోస్తామని హెచ్చరించారు. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోకుంటే ఆయనకు తెలంగాణలో తిరగడం కష్టమవుతుంది అని అన్నారు. ఇందుకు రైతులంతా మద్దతుగా నిలవాలని కోరుతున్నానన్నారు. రైతులెవ్వరూ అధైర్యపడొద్దు.. ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది.. తడిసిన ప్రతీ గింజనూ ప్రభుత్వం కొంటుంది అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

రూ.112.14 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

రూ.56.55 కోట్లతో కౌటాలాలో నిర్మించిన 132/33 కేవీ సబ్ స్టేషన్ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. రూ.4.22 కోట్లతో చింతలమనేపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన. రూ.2.98 కోట్లతో గుడ్లబోరి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు, రూ.3.08 కోట్లతో సిర్‌పూర్ కాగజ్ నగర్‌లోని కాపువాడలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు, రూ.2.89 కోట్లతో సిర్పూర్(టి) మండలం చింతకుంటలో 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.2.72 కోట్లతో కాగజ్‌నగర్ మండలం అంకుషాపూర్‌లో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు, రూ.6 కోట్లతో రెబ్బెన మండలం నంబాల గ్రామంలో 2 ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్లాంట్‌కు, రూ.15 కోట్లతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు, రూ.18.7 కోట్లతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *