– పలు జిల్లాల్లో గతేడాది కన్నాఅధిక ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రుతపవనాలు జాడ ఇంకాలేదు. ఈ క్రమంలో అనేక జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగింది. నిరుటితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.4 డిగ్రీలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో నిప్పుల కుంపటిగా ఉన్న రాష్ట్రం, సాయంత్రం వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆదిలాబాద్ జిల్లా రైతులు మార్కెట్ యార్డులో పోసిన జొన్నలు తడిసి ముద్దయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు పదిరోజుల్లో ప్రవేశించనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాలు జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నది. వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు వెల్లడించింది. వచ్చే నాలుగు రోజులు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





