ఊహాజనిత అంశాలతో పిటిషన్ దాఖలు
కేసు వివరాలను రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దు
ఎసిబికి ఆదేశాలు ఇచ్చిన ‘సుప్రీమ్’ ధర్మాసనం
న్యూదిల్లీ,సెప్టెంబర్20(ఆర్‌ఎన్‌ఎ): సంచలనం సృష్టించిన వోటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలాగే సిఎం రేవంత్‌కు ఊరట దక్కింది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ బదిలీ పిటిషన్‌పై విచారణను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ముగించింది. వోటుకు నోటు కేసును తెలంగాణా నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చెయ్యాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని కోర్ట్ వ్యాఖ్యానించింది.
విచారణ జరుగుతున్న ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోచేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌కు సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని కూడా కోర్ట్ ఆదేశించింది. సీఎం, హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరించింది. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది.
ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశాలతో వోటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కినట్టయింది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. బెయిల్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన క్షమాపణలు చెప్పింది విధితమే. ఆ సందర్భంగా ప్రస్తావిస్తూ సుప్రీకోర్ట్ ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంటుందని సుప్రీంకోర్ట్ పేర్కొంది. అయితే ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని ఈ సందర్భంగా హితబోధ చేసింది.