క్వాంటం ప్రపంచం

కాలపు గుండె పుస్తకంలో

క్యాలెండర్ పేజీ మారింది

జ్ఞాపకాల మెసెంజర్ గ్యాలరీతో

ఓ సంవత్సరం వీడ్కోలు పలికింది

నులివెచ్చని జ్ఞానకిరణాల వెలుగులో

ఆత్మీయ వేడుకల జలధారలో

స్వాగతమంటోంది క్వాంటం ప్రపంచం

 

విజయాలు వివాదాలు విప్లవాలు

విషాదాలు వికాసాలు ఇలాంటివెన్నో

అనుభూతుల ఇంద్రధనస్సు కదా జీవితమంటే

నీలో నీతో బతుకు యుద్ధం నేర్చుకుంటే

ప్రతి నిమిషం నీకు ఉద్యమమై పాఠం చెప్తుంది

నీ అనుభవమే భవిష్యత్ తరాల అంతరిక్షంలో

పాఠ్యాంశాల బ్లాక్ హోల్ అవుతుంది

 

పరిణామంలో కొత్త ప్రవాహంతో

పాత ప్రభావం కలిసే ఉంటుంది

నూతన ఉషస్సుతో నిరాశ నిస్పృహల

స్వరాలను తరిమేస్తూ

ఆశావాద ఆక్సిజన్ ను

నీ రక్తనాళాల్లో నింపేస్తూ

ఆత్మవిశ్వాస ప్రకాశానికి

నీ గుండె ఓ దిక్సూచి గెలాక్సీ

విశ్వశాంతి సౌధంలో

వసుదైక భావనతో

మన హృదయాల ముంగిట్లో

భిన్న సంస్కృతిలోని ఏకత్వాల ముగ్గులతో

పర్యావరణ జాగృతి సందేశ జాబిల్లి తో

హ్యాపీ న్యూ ఇయర్ సందడి చేద్దాం

– ఫిజిక్స్ అరుణ్ కుమార్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page