కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం త‌ప్పుడు ప్ర‌చారం

– అన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం
– యూనివ‌ర్సిటీల భూముల క‌బ్జా ఆపండి
– అస‌భ్య భాష రాజ‌కీయాల్లో త‌గ‌దు
– రాబోయేది డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారే
– మీడియా స‌మావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు

వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 8: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్‌కు రావ‌డం ఆనందంగా ఉంద‌ని, దివ్య భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాన‌ని ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు అన్నారు. వరంగల్‌ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా గురువారం ఇక్క‌డ మీడియాతో ఆయ‌న మాట్ల‌డారు. గ‌తంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సందర్శన సమయంలో కేంద్ర మంత్రితో కలిసి ఇక్కడికి వచ్చినట్టు గుర్తు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు వేల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. వరంగల్‌కు బీజేపీ ఎంపీ లేకపోయినా రూ.2,000 కోట్లతో అభివృద్ధి చేసింద‌ని, కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, ములుగులో సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభం (కోర్సులు ఆరంభం), కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో రైలు కోచ్ ఉత్పత్తి త్వరలో ప్రారంభం ఇవన్నీ కేంద్ర నిధుల వల్లనే సాధ్యమయ్యాయ‌ని చెప్పారు. అమృత్, స్మార్ట్ సిటీలు, హృదయ్ పథకాలతో మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కేంద్రం కేటాయించిన‌ట్లు వివ‌రించారు.

బీఆర్ఎస్-కాంగ్రెస్ ల‌తో అభివృద్ధి శూన్యం

గత ప‌దేళ్ల‌ల్లో బీఆర్ఎస్ పాలనలో వరంగల్, హన్మకొండ, జిల్లా కార్పొరేషన్లకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల అమ్మకాలపైనే ఆధారపడుతోందని, ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్ప‌డుతోంద‌ని విమర్శించారు. వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో రూ.4,000 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ చేస్తామని చెప్పి పని మొదలెట్టలేదన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు లేకపోయినా భూములు అమ్ముకోవాలని కుట్రలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంద ఎకరాలు, మౌలానా ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాలు రియల్ ఎస్టేట్‌కు ఇచ్చే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.100 కోట్లు ప్రకటించి రూ.100 కూడా ఇవ్వకపోవడం దారుణ‌మ‌ని అన్నారు. యూనివ‌ర్సిటీల భూముల‌ను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని, ప్రతిపక్ష నేత కేసీఆర్ ‘ఓటీపీ’లా వచ్చి మాయమయ్యారని భూముల కబ్జా, రైతు బంధు ఆపడం, విద్యార్థుల నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బ‌కాయిలపై చర్చ జ‌ర‌గ‌లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉంద‌న్నారు.

మున్సిపల్ ఎన్నికలు.. భవిష్యత్ ప్ర‌ణాళిక‌లు

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని రామచంద‌ర్‌రావు పిలుపునిచ్చారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు భూసేకరణ పూర్తి చేస్తే గ్రాండ్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కృష్ణా-గోదావరి నీటి వివాదాల్లో కేసీఆర్ 299 టీఎంసీలకు సంతకం చేసి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్-బీఆర్ఎస్ మోసాలను సాక్ష్యాల‌తో వివ‌రించారు. జర్నలిస్టుల డిమాండ్లకు మద్దతు ఇవ్వ‌డ‌మేగాక‌ ప్రజా సమస్యలపై పోరాడ‌తామ‌ని హామీ ఇచ్చారు.

పంచాయతీ విజయాలు ప్రజల విశ్వాసానికి ప్ర‌తీక

పంచాయతీ ఎన్నికల్లో గ‌తంలో 163 స్థానాల నుంచి 900పైగా సర్పంచుల విజయం పార్టీపై ప్రజల విశ్వాసానికి ప్ర‌తీక అని, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీలో వర్గాలు లేవని, మోదీ నాయకత్వంలో అంద‌రం ఐక్యంగా ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. రాజకీయాలు గౌరవప్రదంగా ఉండాల‌ని, అసభ్య భాష తగ‌ద‌ని హిత‌వు ప‌లికారు. రాష్ట్రంలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారేన‌ని ప్రకటించారు. సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వరంగల్‌తో బీజేపీకి ప్రత్యేకమైన అనుబంధం

అంత‌కుముందు రామచందర్‌రావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాషాయ జెండాలతో, జై బీజేపీ నినాదాలతో నిర్వహించిన భారీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పార్టీ శ్రేణుల ఉత్సాహం, అచంచలమైన నిబద్ధత తనకు మరింత ప్రేరణనిచ్చిందని తెలిపారు. వరంగల్‌తో బీజేపీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఉందని గుర్తుచేశారు. 1984లో బీజేపీకి లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న కాలంలో ఆ రెండు సీట్లలో ఒకటి వరంగల్‌ జిల్లాకు చెందిన జంగారెడ్డి విజయంగా నిలిచిందన్నారు. పార్టీకి అండగా నిలిచిన అలాంటి చారిత్రక వరంగల్‌ గడ్డపౖౖె అడుగుపెట్టడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం గొప్ప ఆధ్యాత్మిక శక్తిని అందించిందని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో బీజేపీ ప్రయాణం మరింత వేగంగా, బలంగా సాగాలని ఆకాంక్షించారు. మాతృభూమికి మరింత గొప్పగా సేవ చేయడానికి కార్యకర్తలందరికీ శక్తి, ధైర్యం, జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *