చిన్నిమొగ్గ వెలుగు

అద్దం ముందు నిలబడ్డ ప్రతిసారీ ఆమెకు తనకళ్లల్లో ఏదో తెలియని కలత, మనసులో ఏదో చెప్పలేని భారంలా అనిపించేది. ఆమె పేరు సాహితి. తన చిన్న ప్రపంచాన్ని ప్రేమతో, నమ్మకంతో నడిపించే ఓ మంచి మనసు ఆమెది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె కళ్లచుట్టూ చేరిన నల్లటి వలయాలు, ఆ అద్దంపై కనిపించే మరకలు, ఇవన్నీ ఆమె ఒంటరితనాన్ని బాధను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. వసంతం రాకపోయినా  అందుకోసం ఎదురు చూసే ఓపిక గల  మహిళ సాహితి. ఎండిన మాను కూడా ఒకరోజు మళ్ళీ చిగురిస్తుందని నమ్ముతుంది, అదే ఆమెబలం, అదే ఆమె బలహీనత. ప్రతిరోజూ ఇంటి ముంగిట్లో పాదుతీసి మొక్కకు నీళ్లుపోసేది.

పరిమళం కోసం విచ్చుకున్న  పువ్వులా, ఆశగా ఆమె హృదయం విచ్చుకుంటుంది. కానీ అద్దంముందు నిలబడితే మాత్రం ఎక్కడో దాగిన బాధ ఆమెకంటిలో తడి అద్దంపై మరకల్లా కనిపించేది. “ఇదేం మరక, ఇది నా కంటితడినా, లేక అద్దమే మరకతో నిండిపోయిందా ఈ ప్రశ్నలను రోజూ ఆమె మనసులో అనుకుంటూ వుంటుంది.

ప్రతిరోజూ ఆ మరకలు పెరుగుతున్నట్టే అనిపించేది. అయితే నిజానికి అవి పెరుగుతున్న మరకలు కాదు, ఆమె మనసులోని బలహీనతలు. ఒక్కోసారి వెన్నెలరాత్రి కూడా నిండు అమావాస్యలా కనిపించేది. నిద్రలేనిరాత్రులు, మాటలు కరువైనబాధ, అలసట ఇవన్నీ కలిసి మరింత భారంగా అనిపించేది.

కంటిపాపల బెదురులు, హృదయంపై పెద్దపెద్ద భారాలు. అయినా, సాహితి మాత్రం ఆశను వదులుకొనేది కాదు. “ఏదో ఒకరోజు నిన్నలో కలిసిపోయిన కలలు తిరిగి తనను పలకరిస్తాయి” అని నమ్ముతుంది.  కానీ ఎక్కడో  ఆమెలో నిద్రిస్తున్న నిరాశ నిద్రలేపి కన్నీళ్లతో విడదీయలేని బంధాన్ని జతకడుతూ వుంటుంది. ఆమె హృదయంలోని తీరాలను ఉప్పెనలా కంపింపజేసే ఆ భావాల సుడిగుండం ఆమెను ఎప్పుడూ  లోపలికి లోపలికి లాగుతూ వుంటుంది.

ఒకరోజు ఉదయం అద్దం తుడుస్తూ సాహితి, అద్దం శుభ్రంగానే వుంది ఇప్పుడు మరకలేమీ లేవు, అయితే మరకల్లా కనించిన ఆ మరకలు నా కంటి తడినా? అయితే, అప్పుడు  గ్రహించింది ఆమె- “అద్దం మీద కనిపించే ప్రతి మరక కూడా తన మనసులోని భారమేనని. తను తుడవాల్సింది అద్దం కాదని.” ఆ క్షణమే ఆమె లోపల ఏదో మెల్లగా మార్పు.

అప్పుడు, చిన్న చిరునవ్వు పెదవులపై  మొలిచింది. ఇక, వసంతం కోసం ఎదురుచూసే బదులు వసంతాన్ని తానే సృష్టించుకోవాలని నిర్ణయించుకుంది. అప్పుడే, ఆమె అనుకుంది. పాదుతీసి మొక్కకు నీళ్లు పోసినట్టుగా  ప్రతిరోజూ మనసు మొక్కకు కూడా నీళ్లు పోయాలని. అలాగే, ఇప్పుడు పువ్వు పూయడానికి కూడా కొంచెం సమయం పడుతుందని సాహితి తెలుసుకుంది. తనలోపల పువ్వు పూచేందుకు మొదటిమొగ్గ ఈరోజే పుట్టిందని కూడా  అనుకుంది.  అద్దం పైన ఇప్పుడు ఆమెకు ఒక్క మరక కనిపించలేదు. తనలో మొలకెత్తిన చిన్ని మొగ్గ వెలుగు మాత్రమే కనిపించింది. అదే ఇప్పుడు ఆమె మొదటి విజయం.

-లక్ష్మీ కందిమళ్ళ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page