మెరుపు తీగెలు

  “దెయ్యం దెయ్యం… నువ్వున్నావా?”

          “ఉన్నాను, లేకపోతే నువ్వెందుకు నన్నడుగుతావ్?”

          “దెయ్యాలు లేవంటారు కొందరు…”

          “లేనోళ్లకి లేవ్…”

          “దెయ్యాలు వున్నాయంటారు కొందరు…”

          “ఉన్నోళ్లకి వున్నాయ్…”

          “అసలు నువ్వు వున్నావో లేవో సరిగ్గా చెప్పు”

          “నాక్కూడా తెలీదు…”

          “దేవుడు వున్నట్టయితే దెయ్యమూ వున్నట్టే కదా?”

          “కదా?!”

          “చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ అదిగో బూచి యిదిగో బూచి, బూచికి యిచ్చేస్తాననేది”

          “అయితే నువ్వు చిన్నప్పుడే దెయ్యాల్ని చూశావన్నమాట”

          “ప్రత్యక్షంగా చూడలేదు, కాని వూహించుకున్నాను…”

          “ఎలా?, కథలు వినా?”

          “ఊ… దెయ్యాల్ని నమ్మని మాతాత నేను అన్నం తిననప్పుడల్లా దెయ్యాల్ని చూశాననేవాడు…”

          “సరే, నువ్వెలా నమ్మేవాడివి?”

          “దెయ్యానికి మెల్లకన్ను వుందని చెప్పేవాడు, అంత కరెక్ట్‌గా చెప్పాడంటే…”

          “అంటే, మనుషులే దెయ్యాలనా?”

          “ఏమో తెలీదు, కాని మా వూళ్ళో దెయ్యాలు వున్నాయని లేవనీ పందేలు కూడా వేసుకున్నారు”

          “ఎవరు గెలిచారు?”

          “అందరూ వోడిపోయారు. కొందరు లేవని నిరూపిస్తే, మరికొందరు వున్నాయని నిరూపించారు, యెవరి అవసరం వారిది”

          “మా దెయ్యాలతో అవసరమా?”

          “ఆ… పిల్లలు అల్లరి పెట్టకుండా అన్నం తినాలంటే దెయ్యాలు వుండాలి. పెద్దలు వెళ్ళకూడని చోటుకి వెళ్ళకుండా వుండాలంటే దెయ్యాలు వుండాలి. భూత మాంత్రికులు బతకాలంటే దెయ్యాలు వుండాలి. హర్రర్ సినిమాలూ వెబ్ సీరీసూ తియ్యాలంటే దెయ్యాలు వుండితీరాలి!”

          “అలాంటప్పుడు దెయ్యాలను చూసి యెందుకు భయపడతారు?”

          “అది భయం కాదు, రెస్పెక్ట్… గౌరవం!”

          “మరి నువ్వెందుకు వణుకుతున్నావ్?”

          “నాకు దెయ్యాలంటే భయం!”

          “కాని నువ్వు చచ్చి దెయ్యమైపోయావుగా?, యింకెందుకు భయం?”

          “అబద్దం!”

          “లేపోతే నువ్వు నాతో యెలా మాట్లాడగలవ్?”

          “అమ్మో, నాకు భయంగా వుంది…”

          “దెయ్యాలు దెయ్యాల్ని చూసి కాదు, మనుషుల్ని చూసి భయపడాలి!”

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page