“ఆరవ దలైలామా లాసాకు వెళ్ళిన సమ
యంలో టిబెట్రాజకీయాలు గందరగోళం గా ఉన్నాయి. ఆయనకు సన్యాసి జీవి పట్లఆసక్తి లేదు. రాజభవనంలో ఉండకుండా ఆశువుగా పాటలు పాడుతూవీ థుల్లో తిరిగేవాడట. ప్రేమకవిత్ వం రాసేవాడు. అందువల్ల కాబోలుమం గోల్ రాజు లాజంగ్ ఖాన్ ఈయనను దలై లామా కాదని ఆరోపించాడు..”
గిరియానం..26
రెండురోజుల నుంచి ఎక్కడికి వెళుతున్నా తవాంగ్ లో కొండపై ఉన్న పెద్ద బుద్ధుడు ఉన్న కొండచుట్టూ తిరుగుతూ వెళ్ళాం. తవాంగ్ లోకి ప్రవేశిస్తున్నప్పుడే కొండపై ఉన్న బుద్దుడు నన్ను ఆకర్షించాడు. ఈ రోజు ఉదయమే ఆ జెయింట్ బుద్దా స్టాచ్యూ దగ్గరికి బయలుదేరాం. కొండ పై దాకా కార్ వెళుతుంది. అంత ఎత్తయిన బుద్ధుడిముందు మేం చాలా అల్పులమయ్యాం. తవాంగ్ టౌన్లో చిన్న కొండపైన ఉన్న ఆ బుద్ధ విగ్రహం ఎత్తు సుమారు ముప్ఫై అడుగులు ఉంటుంది. బంగారపు పూతతో ఉన్న కంచువిగ్రహం. శాక్యముని బుద్ధుడు పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఉంది. విగ్రహం కింద రెండు ప్రార్థనా హాళ్లు కూడా ఉన్నాయి. పదకొండువేల అడుగులో ఎత్తునుంచి నుంచి తవాంగ్ వ్యాలీ మొత్తం 360 డిగ్రీల వ్యూతో కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడినుంచి మనలను కదలనివ్వదు. హెచ్. ఇ తెగెత్సే రింపోచే దానిని 2015లో ప్రతిష్ఠించారు.
రింపోచే అంటే టిబెటన్ బౌద్ధంలో పునర్జన్మ పొందిన ఉన్నతమైన లామా అని అర్థం. తవాంగ్ మొనాస్టరీలో చాలా మంది రింపోచేలు ఉంటారు. హెచ్. ఇ. తెగెత్సే రింపోచే అసలుపేరు థప్టన్ గ్యాల్స్టన్. టి.జి రింపోచే అని కూడా పిలుస్తారు. ఆయన 19 ఆగస్టు 1967లో తవాంగ్ లోని షైరో గ్రామం, నేసర్ జంగ్ పత్సే హైడ్రాలిక్ పవర్ సెంటర్ నిర్మాణ సమయంలో ఇరవైయేడు గ్రామాల ప్రజలు ఆ ప్రాజెక్టువల్ల మఠం, ప్రకృతికి నష్టం కలుగుతుందని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేక ఉద్యమానికి ఈయన నాయకత్వం వహించారు. ఆయన 2014 ఢిల్లీలో కన్నుమూశారు. తవాంగ్ ప్రజలు ఆయనను కేవలం మతగురువుగానే కాకుండా సామాజిక కార్యకర్తగా, పర్యావరణ పరిరక్షకుడిగా కూడా గుర్తుంచుకుంటారు.
అక్కడినుంచి మేం ఆరవ దలైలామా పుట్టిన ప్రదేశానికి వెళ్ళాం. తవాంగ్ మంచి డిరాంగ్ వెళ్ళే దారిలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న మఠం ఇది. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. దీనిని 1489లో ఉర్గన్ సాంగ్ పో అనే గురువు కట్టించాడని చెపుతారు. అంటే తవాంగ్ మొనాస్టరీ కంటే (1680) దాదాపు రెండువందల యేళ్ళ పాతది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, రాళ్ళతో చేసిన ఆవరణ, పైన బౌద్ధ జెండాలతో ప్రశాంతంగా ఉంటుంది. తెల్లని గోడలతో, పైన ఎరుపు రంగు పట్టీలతో అందంగా ఉంది. పైకి వెళ్ళేదారిలో ఎడమ వైపున ఒక చిన్న గుండం లాంటిది ఉంది. దానిలో ఇప్పటికీ నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఆ నీటిని ఆరవ దలైలామా తల్లి ఉపయోగించేవారని తెలిపే ఒక బోర్డు ఉంది. ప్రజలు దానిని పవిత్రమైన తీర్థంగా స్వీకరిస్తారు. పైకి వెళితే ఒక పెద్ద హాలులో మొదటి నుంచి ఇప్పటి దలైలామా వరకు అందరి చిత్రపటాలు ఉన్నాయి.
ఆరవ దలైలామా మార్చి ఒకటో తేదీ 1683 తవాంగ్ లో జన్మించిన మొంపా జాతి ఏకైక దలైలామా. తండ్రి సాంగ్ పో వంశానికి చెందిన తాషి టెన్జిన్. తల్లి తేవాంగ్ లామో బెఖర్ గ్రామానికి చెందిన మొంపా రాజ వంశపు మహిళ. ఈయన పేరు ” త్సాగ్యాంగ్ గ్యాస్ట.” అంటే అర్థం ” ఓషన్ ఆఫ్ మీలోడియస్ సాంగ్స్.” ( మధురమైన పాటల సముద్రం). ఈయన అందరి దలైలామాలాంటి వాడు కాదు, భిన్నమైన వాడు. పేరుకు తగ్గట్లు గానే కవి, పాటల రచయిత. ఈయన రాసిన ప్రేమపాటలు ఇప్పటికీ టిబెట్, నేపాల్, అరుణాచల్ ప్రదేశ్ లో ప్రజలు పాడుకుంటారట. రాజకీయాల కంటే సాహిత్యం, స్వేచ్ఛాయుత జీవితం ఇష్టపడేవాడు. ఈయన గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా అనిపించింది.
1697లో ఈయనకు పద్నాలుగేళ్ల వయసులో ఐదవ దలైలామాగా గుర్తించి టిబెట్ లోని లాసాకు తీసుకువెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు.. ” ఒక కర్రను నాటి దీనికి పైన మూడు కొమ్మలు మొలిచిన నాడు నేను ఇక్కడికి ( తవాంగ్ ) తిరిగివస్తాను.” అని చెప్పాడట. తర్వాత చెట్టుకు మూడు కొమ్మలు సమానంగా ఎదిగాయని, కానీ ఒక కొమ్మ గాలికి విరిగిపోయిందని స్థానికులు చెప్పారు. అదే ఈ ప్రాంగణంలో లోపలికి ప్రవేశిస్తూనే కుడివైపున ఉన్న ఒకపెద్ద వృక్షం ఇదే అనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. అయితే ఆరవదలైలామా అయితే తిరిగి రాలేదు కానీ పధ్నాలుగవ దలైలామా టిబెట్ నుంచి పారిపోయి తవాంగ్ కు తిరిగి వచ్చాడు. కాబట్టి వచ్చింది ఇక్కడినుంచి వెళ్ళిన దలైలామానే ( ఆరవ) అని ముంపా ప్రజల నమ్మకం.ఆరవ దలైలామా లాసాకు వెళ్ళిన సమయంలో టిబెట్ రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. ఆయనకు సన్యాసి జీవితం పట్ల ఆసక్తి లేదు.
రాజభవనంలో ఉండకుండా ఆశువుగా పాటలు పాడుతూ వీథుల్లో తిరిగేవాడట. ప్రేమకవిత్వం రాసేవాడు. అందువల్ల కాబోలు మంగోల్ రాజు లాజంగ్ ఖాన్ ఈయనను దలైలామా కాదని ఆరోపించాడు.చివరకు 1706లో చైనా చక్రవర్తిని కలవడానికి బీజింగ్ నగరానికి వెళుతున్న దారిలో కింఘై లేక్ సమీపంలో మాయమయ్యాడని ప్రజల నమ్మకం, అతనికి విషమిచ్చి, అక్కడే చంపేసారని చరిత్రకారులు చెప్పారు. మొత్తం మీద ఆరవ దలైలామా కేవలం ఇరవైమూడేళ్ళు మాత్రమే చాలా విభిన్నంగా జీవించాడు.
మధ్య దారిలో జాంగ్ గ్రామంలో కొంతమంది యువతీ యువకులు వాహనాలను ఆపి విరాళాలు సేకరిస్తున్నారు. నేను వాళ్ళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. అదే రోజు ఏడాదికి ఒకసారి చేసే ప్రత్యేకమైన పూజ మొదలైంది. అది పదమూడు రోజులు కొనసాగు తుందట. అందులో ఇంటికి ఇద్దరు చొప్పున పాల్గొoటారనీ, ఆ పూజ కొరకు విరాళాలు సేకరిస్తున్నామని చెప్పారు. మనస్ఫూర్తిగా మనం ఇచ్చిన డబ్బులు ( మనం ఎంత యిస్తే అంతే ) తీసుకుంటారు. అమ్మాయిలు ముంపా సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. అబ్బాయిల్లో కొందరు వివిధ రకాల మాస్కులు పెట్టుకున్నారు. బౌద్ధ జెండాలు పట్టుకొని, ఊరంతా పాటలు పాడుతూ ఊరేగింపు తీస్తారట. వాళ్ళతో ఫోటోలు తీసుకొని ముందుకు కదిలాo.
అక్కడి నుంచి సేలాలేక్ చూసుకొని, సేలాపాస్ కు వెళ్ళాం. ఇది ప్రపంచంలో ఎత్తయిన రోడ్డు మార్గాలలో ఒకటి. తవాంగ్ నుంచి డెబ్బై ఎనిమిది కి.మీ దూరంలో పశ్చిమ కామెంగ్ జిల్లాలో ఉంది. ఈ పాస్ మీదుగానే జాతీయ రహదారి నెంబర్ పదమూడు వెళుతుంది. ఇదే తవాంగ్ ను మిగతా ఇండియాతో కలిపే ఏకైక మెయిన్ రోడ్డు. 13,000 అడుగుల ఎత్తులో వున్న కొండలను తొలిచి రెండు లైన్ల టనల్ ను నిర్మించిన మన ఇంజినీర్ల ప్రతిభను కొనియాడవలసిందే .. ఈ నిర్మాణాన్ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. దాదాపు ఎనిమిది వందల ఇరవైఐదు కోట్లు ఖర్చయింది. ఈ టనల్ వల్ల తవాంగ్ డిరాంగ్ ల మధ్య దూరం దాదాపు పన్నెండు కిలోమీటర్లు తగ్గింది. తొంభై నిమిషాల ప్రయాణసమయం ఆదా అవుతుంది. ఇప్పుడు సేలా పాస్ దాటవలసిన అవసరం లేదు. ఈ టనల్ లో నుంచి ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల చలికాలంలో మంచులో కూడా రాకపోకలు సాగుతున్నాయి. మిల్ట్రీ వాళ్ళకు, స్థానికులకు, పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇంత ఎత్తులో వున్న అతి పాడరైన బై లైన్ సేలా టనల్ ను 9/3/2024 నాడు ప్రధాన మంత్రి ప్రారంభించాడు.





