ఖాఠ్మండు, ఆగస్ట్ 29 : జలప్రళయ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సహకరిస్తామంటూ పలు దేశాలు ముందుకురాగా.. నేపాల్ ఆ అభ్యర్థనలను తొలుత తిరస్కరించింది. ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విదేశీ సహాయక బృందాలను దేశంలోకి అనుమతించేందుకు అంగీకరించింది. తమ బృందాలు సహాయక చర్యలు నిర్వహించగలవని, విదేశీ బృందాలను అనుమతించబోమని ఇటీవల నేపాల్ వెల్లడించింది. అయితే గల్లంతయిన వారిలో పలు దేశాల ప్రజలు ఉన్నారు. దాంతో సహాయక చర్యల్లో భాగం అవుతామని ఆయా దేశాల నుంచి వచ్చిన దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా చివరకు నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సొరంగాల్లో రక్షణ చర్యలు చేపట్టగల సిబ్బంది, డీఎన్‌ఏ టెస్టింగ్, ఫోరెన్సిక్ పరీక్షలు చేయగల అంతర్జాతీయ బృందాలనే అనుమతించాలని భావిస్తోంది. నిర్దిష్ట విభాగాల్లో.. పరిమిత సంఖ్యలోనే రెస్క్యూటీమ్స్‌కు అనుమతి తెలపనున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు డియాకు వెల్లడించారు. పొరుగుదేశం నేపాల్‌కు భారత్ నుంచి అత్యవసర సహాయం అందుతోంది. తాజాగా 10 టన్నుల సామగ్రితో మూడో విమానం ఆ దేశంలో ల్యాండ్ అయింది. అలాగే 11 మంది బృందం కూడా వెళ్లింది. వారిలో వైద్యులు, సొరంగాల వద్ద సహాయక చర్యలు నిర్వహించగల సిబ్బంది, ఇతరులు ఉన్నారు. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకున్న 84 మంది భారతీయుల్ని కాపాడారు. వారిలో తమిళనాడు రాష్టాన్రికి చెందిన 21 మంది భారత్‌కు చేరుకున్నారు. 320 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ విలయంలో మృతుల సంఖ్య 616కి చేరింది. 2400 మందికిపైగా గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు వెల్లడించారు.
నీరు రంగు మారుతోంది జాగ్రత్త: చైనా హెచ్చరిక
హిమనీనదం బద్దలై ఇప్పటికే నేపాల్‌లో వరదలు రాగా.. ఆ విపత్తు వల్ల పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్ వైపున ఏర్పడిన సరస్సు పొంగుతోంది. దానిపై చైనా మరోసారి హెచ్చరిక చేసింది. ఏ క్షణాన అయినా అది ఉప్పొంగి, కిందికి దూసుకురావొచ్చని పేర్కొంది. నీటి రంగులో మార్పును అందుకు కారణంగా చెప్పింది. నేపాల్ విదేశాంగశాఖతో ఈ సమాచారాన్ని షేర్ చేసుకుంది. విపత్తు తర్వాత ఏర్పడిన సరస్సు రంగు మారుతోంది. ముదురురంగులోకి వస్తోంది. అంటే అది బద్దలయ్యేందుకు అవకాశం ఉంది అని చైనా అధికారులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





