-కేబినెట్ పునర్వవ్యస్థీకరణతో కొత్తదనం తేవాలి
– మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని అన్నారు. ముఖ్యమంత్రిని పని చేసుకోనివ్వాలని, ఆటంకాలు సృష్టించకూడదని చెప్పారు. కాంగ్రెస్ క్యాడర్‌లో అసంతృప్తి ఉందని.. కానీ, కాంగ్రెస్ పాలనపై సాధారణ ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన కీలక విషయాలపై స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త వాటిని అమలు చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రివర్గంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయ్యిందని, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే కొత్తదనం వస్తుందన్నారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీలోనూ క్రమశిక్షణ లేదని, కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు తగ్గించాలన్నారు. పార్టీ లైన్ దాటిన వారిపై వేటు వేయకపోతే నష్టం జరుగుతుందన్నారు. పార్టీలో లీకేజీలను కంట్రోల్ చేయాలని, క్రమశిక్షణ ముఖ్యమని ఆయన చెప్పారు. మరోవైపు, నాలుగు పంటలకూ రైతు భరోసా అందించాలని శాసన మండలి ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. రిజిస్టేష్రన్ చట్టం-1908లోని సెక్షన్ 22-ఏని రద్దు చేయాలని సూచించారు. ప్రజలకు ఉచిత పథకాలను తగ్గించాలని, నిజమైన లబ్దిదారులకే వాటిని అందించాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయొద్దని, వారికి న్యాయం చేయాలని సుఖేందర్ రెడ్డి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు