భారతీయుల సొమ్ము విదేశీ సెమికండక్టర్ కంపెనీలకు పంపకం?

ప్రభుత్వాలు చెబుతున్నట్టు ఎఫ్.డి.ఐ ల ద్వారా టెక్నాలజీ మనకు బదిలీ కాకపోగా మన డబ్బునే వేల కోట్లు పెట్టుబడి సబ్సిడీగా ఇవ్వటం వలన ప్రధానంగా విదేశీ కంపెనీలు లాభపడుతున్నాయి. కొంతమేర దేశీయ ప్రైవేటు పెట్టుబడిదారులు లబ్ది పొందుతున్నప్పటికీ దేశీయ ప్రైవేటు పెట్టుబడిలో తరచుగా రుణాల రూపంలో విదేశీ ఫైనాన్స్ కంపెనీల వాటా ఉంటోంది. ప్రధాన మంత్రి ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం ద్వారా దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. కానీ మన డబ్బుని సబ్సిడీగా ఇచ్చి విదేశీ కంపెనీల టెక్నాలజీని అరువు తెచ్చుకుని దేశంలో విదేశీ ఉత్పత్తుల తయారీకి అనుమతి ఇవ్వటం అంటే విదేశీ సరుకులకు దేశీయ రంగు కాగితాలు చుట్టి దేశీయ ముద్ర వేసుకోవటమే. దానికి బదులు అదే డబ్బు భారతీయ పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో పెట్టుబడిగా పెట్టి నిజమైన స్వావలంబన సాధించలేమా? 

దేశాన్ని సెమీ కండక్టర్ మానుఫాక్చరింగ్ కు కేంద్రంగా తయారు చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించి అందుకు విధానాలు రూపొందించి అమలు చేస్తోంది. భవిష్యత్ టెక్నాలజీ రంగం అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ పునాది పైన నిర్మితం అయ్యే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నేపధ్యంలో తైవాన్, చైనా దేశాలకు మల్లే ఇండియా కూడా ఏఐ టెక్నాలజీ సరఫరాదారుగా అవతరించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని అభినందించాలి. ఈ లక్ష్యం కోసం ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 2021లో రు 76,000 కోట్లతో ఐఎస్ఎం 1.0, జులై 2026లో రు 1,27,000 కోట్ల కేటాయింపుతో ఐఎస్ఎం 2.0 ప్రారంభించింది. వీటి ద్వారా ఇండియాలో సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి సబ్సిడీలు ఇస్తున్నది. ఐతే ఈ సబ్సిడీలను భారతీయ కంపెనీల అభివృద్ధికి ఖర్చు చేస్తే టెక్నాలజీ రంగంలో ఇండియా స్వావలంబన సాధించేందుకు దోహద పడుతుంది. అందుకు బదులు బిలియన్ల డాలర్ల డబ్బు రాశులు కలిగి ఉన్న విదేశీ సెమీ కండక్టర్ కంపెనీలకు ప్రభుత్వ సబ్సిడీలు కేటాయించటం ఆందోళనకరం. భారత ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బుని దేశీయ ప్రైవేటు కంపెనీలకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు ఉచితంగా అప్పగిస్తే ఆ అభివృద్ధి భారత ప్రజలకు ఎలా చెందుతుంది? దేశీయ ప్రైవేటు కంపెనీలు సొంత టెక్నాలజీ అభివృద్ధి చేసినా అది దేశానికి ఉపయోగకరం. ఎందుకంటే టెక్నాలజీ, లాభాలు దేశం లోపల ఉంటాయి. కానీ దేశీయ ప్రైవేటు కంపెనీలు విదేశీ టెక్నాలజీ కంపెనీల నుండి టెక్నాలజీ మద్దతు మాత్రమే తెచ్చుకుంటున్నాయి.

భారత ప్రభుత్వం ప్రకటించిన సెమికండక్టర్ విధానానికి ఆకర్షితులయిన కంపెనీలలో అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజి, ఇండియాకు చెందిన మురుగప్ప గ్రూప్ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు గుజరాత్ లోని సనంద్ లో OSAT (Outsourced Semiconductor Assembly and Test) ని నిర్మించటమే కాకుండా పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. పేరులో ఔట్ సోర్సింగ్ అని ఉన్నప్పటికి మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ తానే స్వయంగా సిలికాన్ చిప్ లు తయారు చేస్తోంది. మురుగప్ప కంపెనీ కూడా తన సొంత కంపెనీ సి.జి. సెమీ ప్రైవేట్ లిమిటెడ్ కి ఆ బాధ్యత అప్పజెప్పింది. కానీ సి.జి.సెమీ కంపెనీలో థాయిలాండ్ కి చెందిన స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ 26% వాటాతో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంటే జపాన్ కు చెందిన రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ 21% వాటాతో ఆధునిక సెమికండక్టర్ సాంకేతిక పరిజ్ఞానం అందిస్తోంది. అంటే ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం విదేశీ కంపెనీలు అందిస్తున్నాయి. సి.జి.సెమీ కంపెనీకి టెక్నాలజీ వాటా లేదు.

మెమొరీ చిప్ తయారీలో పేరు పొందిన మైక్రాన్ టెక్నాలజీ, గుజరాత్ లోని అసెంబ్లీ-టెస్టింగ్-మార్కింగ్-ప్యాకేజింగ్ (ATMP) ఫ్యాక్టరీలో మొత్తం రు 22,516 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ డి‌ఆర్‌ఏ‌ఎం (డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమొరీ) మరియు ఎన్‌ఏ‌ఎన్‌డి (నాట్ ఏ‌ఎన్‌డి లాజిక్ సర్క్యూట్)  మెమొరీ ఉత్పత్తులను ప్రారంభించి ఎగుమతి కూడా చేస్తోంది. ఈ పెట్టుబడి అంతా మైక్రాన్ టెక్నాలజీ జేబులో నుండి వస్తుందనుకుంటే పొరబాటే. రు 22,516 కోట్లలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఐఎస్ఎం 50% (రు 11,258 కోట్లు) సబ్సిడీ కింద ఇస్తుంటే, గుజరాత్ ప్రభుత్వం 20% (4,503 కోట్లు) ఇస్తోంది. ఇది కాక ఆపరేషనల్ సబ్సిడీ కింద ల్యాండ్ ధరలో 50 శాతం, విద్యుత్ మరియు క్లీన్ వాటర్ సరఫరా వ్యవస్థ లలో భారీ సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. విద్యుత్ లో యూనిట్ రు 2 లు ఇస్తూ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ మొత్తం రద్దు చేశారు. అమెరికా బహుళజాతి కంపెనీ, ఇండియాలో నిర్మించిన సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలో సొంతంగా 30% (రు 6,800 కోట్లు) వరకే పెట్టుబడి పెడితే భారత ప్రజలు 70% పెట్టుబడి ఇస్తున్నారు. ఇంతా చేసి కంపెనీ పైన పూర్తి యాజమాన్య హక్కు మైక్రాన్ టెక్నాలజీ కే ఉంటుంది. 70% పెట్టుబడి, విద్యుత్, నీరు ఇస్తున్న భారత ప్రజలకు లేదా భారత ప్రభుత్వానికి ఏ హక్కులు లేవు.

మురుగప్ప సి.జి.సెమీ కంపెనీ, రెనెసాస్ మరియు స్టార్స్ కంపెనీలతో కలిసి నిర్మిస్తున్న కంపెనీకి మొత్తం పెట్టుబడి రు 7,600 కాగా అందులో కేంద్రం రు 3,501 కోట్లు, రాష్ట్రం రు 1,520 కోట్లు ఇస్తాయి. జపాన్ కి చెందిన రెనెసాస్, థాయిలాండ్ కి చెందిన స్టార్స్ మైక్రో కంపెనీలు టెక్నాలజీ పార్టనర్స్ అని చెప్పుకున్నాం. దీనర్ధం ఈ కంపెనీలు తమకు మేధో సంపత్తి హక్కులు (ఐపిఆర్ -ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) కలిగిన టెక్నాలజీని నేరుగా భారత కంపెనీకి బదిలీ చేయవు. కనీసం తమతో భాగస్వామ్యం వహిస్తున్న మురుగప్ప సిజి సెమీ కంపెనీకి కూడా టెక్నాలజీ బదిలీ చేయరు. వాళ్ల టెక్నాలజీని వాడుకునే లైసెన్స్ గాని, ఎలా నడపాలన్న వివరాలు గాని లేదా టెక్నికల్ మద్దతు గాని ఇస్తాయి. అసలు కంపెనీయే మనది కానప్పుడు వాళ్ల టెక్నాలజీ మనకు బదిలీ చేసే సమస్యే ఉండదు. కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వటాన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పధకం -పిఎల్ఐ) అని కేంద్రం పిలుస్తోంది. విదేశీ, స్వదేశీ ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి వరకు వెళ్లకుండా మధ్యలోనే జెల్ల కొట్టకుండా ఎదురు కట్నం ఇవ్వటం!

ఐఎస్ఎం 1.0 లో భాగంగా మొదట 30 శాతం క్యాపిటల్ సబ్సిడీ ప్రకటించిన కేంద్రం సెప్టెంబర్ 2022 లో దాన్ని 50 శాతంకు పెంచింది. మైక్రాన్ కోసం ఈ పెంపు జరిగినట్టు పత్రికలు చెప్పాయి. ఐఎస్ఎం కింద కేంద్రం 12 చిప్ ప్లాంట్ లకు అనుమతి ఇచ్చింది. ఇవి గుజరాత్, అస్సాం, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిషా లలో నెలకొల్పుతున్నారు. గుజరాత్ లో మైక్రాన్, మురుగప్ప లతో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ కూడా ఎగుమతుల లక్ష్యంతో చిప్ ఫ్యాబ్ కంపెనీ స్థాపిస్తున్నది. రు 91,000 కోట్ల భారీ పెట్టుబడితో ధొలేరా లో దీనిని నిర్మిస్తున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్, పేరు పొందిన తైవాన్ కంపెనీ పిఎస్ఎంసి ని టెక్నాలజీ పార్టనర్ గా ఎంచుకుంది. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే నెలకు 50,000 సెమీ కండక్టర్ వేఫర్లు (28 నుండి 110 నానో మీటర్ల టెక్నాలజీతో) ఉత్పత్తి చేస్తుంది. టాటా ఫ్యాక్టరీ కి కూడా కేంద్రం 50 శాతం, రాష్ట్రం 20 శాతం క్యాపిటల్ సబ్సిడీతో పాటు ల్యాండ్, విద్యుత్ లలో భారీ డిస్కౌంట్ ఇస్తున్నాయి. టాటా కంపెనీ అస్సాంలో రు 27,000 కోట్లతో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది. దీనికి పెట్టుబడి సబ్సిడీ షరా మామూలే.

ఉత్తర ప్రదేశ్ లో ఇండియాకు చెందిన హెచ్‌సిఎల్, తైవాన్ కు చెందిన గ్లోబల్ కంపెనీ ఫాక్స్ కాన్ ను టెక్నాలజీ పార్టనర్ గా ఎంచుకుని రు 3,706 కోట్ల ఓఎస్ఏటి కంపెనీ స్థాపిస్తోంది. కేంద్రం రు 1500 కోట్లు, రాష్ట్రం రు 919 కోట్లు ఇస్తుంటే ఫాక్స్ కాన్ కేవలం రు 424 కోట్ల పెట్టుబడి తెస్తోంది. ఒడిషాలో రు 3400 కోట్లతో SiCSem కంపెనీ నిర్మిస్తున్నారు. దీనికి కేంద్రం 40 శాతం, రాష్ట్రం 35 శాతం పెట్టుబడి సబ్సిడీ ఇస్తున్నారు. దీనికి బ్రిటన్ కు చెందిన Clas-Sic వేఫర్ ఫ్యాబ్ లిమిటెడ్, టెక్నాలజీ పార్టనర్. ఒడిషాలోనే అమెరికాకి చెందిన 3D గ్లాస్ సొల్యూషన్స్ సొంతగా 3D గ్లాస్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. దీనికి రు 1943 కోట్ల పెట్టుబడి అవసరం కాగా కేంద్రం రు 1598 కోట్లు ఇస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నంలో 2,500 కోట్ల పెట్టుబడితో అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ (ఏఎస్ఐపి) టెక్నాలజీస్ పేరుతో సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు గత ఆగస్టులో ఢిల్లీ లోనే ఉండి వర్చువల్ గా పునాది రాయి(!) వేశారు. సౌత్ కొరియాకి చెందిన ఏ‌పి‌ఏ‌సి‌టి కంపెనీ లిమిటెడ్ దీనికి టెక్నాలజీ పార్టనర్. కేంద్రం, రాష్ట్రం కలిపి రు 2,388 కోట్లు సబ్సిడీ (కేంద్రం 50%, రాష్ట్రం 40%) ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి మరీ సబ్సిడీ ఇస్తున్నాయి.

ఎఫ్.డి.ఐ లకు గేట్లు తెరుస్తూ ప్రభుత్వాలు తరచుగా మనకు ఆధునిక టెక్నాలజీ వస్తుందని చెబుతాయి. అందులో ఆవగింజంత నిజం ఉంటే ఆశ్చర్యమే. ప్రభుత్వమే సొంతగా పరిశోధన , అభివృద్ధి లకు నిధులు కేటాయించి దేశీయ నిపుణులకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ సొంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకుంటే మన చేతుల్లో లక్షల కొద్దీ ఐపిఆర్ లు, పేటెంట్ హక్కులు ఉంటాయి. గ్లోబల్ వాల్యూ చెయిన్ లో ఆర్ అండ్ డి ద్వారా సంపాదించిన పేటెంట్ హక్కులు, ఐపిఆర్ లకు ఉన్నత స్థానం ఉంటుంది. అంటే ఆదాయం, లాభాలు ఎక్కువ ఉంటాయి. వ్యవసాయ సరుకులు, ముడి ఖనిజాలు మొ.న వాటికి వాల్యూ చెయిన్ లో అధమ స్థానం ఉంటుంది. భారత దేశంలో ఆర్&డి రంగంలో కేటాయింపులు చాలా తక్కువ. (ఆర్&డి కోసం ఇండియా జిడిపిలో కేవలం 1 శాతం కంటే తక్కువ కేటాయిస్తోంది. (ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి 2019-20లో 0.66%, 2023-24 లో 0.84%)  దానికి బదులు ముడి ఇనుము, బాక్సైట్ లాంటి ప్రాధమిక వనరులను ఎగుమతి చేస్తున్నాము. అంటే ఆదాయం, లాభాలు తక్కువ. అలాగే కొత్త సాఫ్ట్ వేర్ సృష్టిలో అధిక లాభాలు ఉంటే భారత కంపెనీల వలె ఔట్ సోర్సింగ్ పనులు చేసే వారికి తక్కువ లాభాలు ఉంటాయి. ఏతావాతా తేలేదేమిటంటే ఆర్ అండ్ డి పెట్టుబడులతో సొంత టెక్నాలజీ సృష్టించకుండా విదేశీ భాగస్వాముల టెక్నాలజీతో సరిపుచ్చుకోవటం వలన రెండు నష్టాలు ఉన్నాయి. ఒకటి: సొంత టెక్నాలజీ అభివృద్ధి చేయలేక టెక్నాలజీ స్వావలంబన కోల్పోవటం, రెండు: దేశ ప్రజల సంపద విదేశీ కంపెనీలకు వివిధ సబ్సిడీల పేరుతో అప్పగించటం. కాబట్టి ప్రభుత్వాలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది.

ప్రభుత్వాలు చెబుతున్నట్టు ఎఫ్.డి.ఐ ల ద్వారా టెక్నాలజీ మనకు బదిలీ కాకపోగా మన డబ్బునే వేల కోట్లు పెట్టుబడి సబ్సిడీగా ఇవ్వటం వలన ప్రధానంగా విదేశీ కంపెనీలు లాభపడుతున్నాయి. కొంతమేర దేశీయ ప్రైవేటు పెట్టుబడిదారులు లబ్ది పొందుతున్నప్పటికీ దేశీయ ప్రైవేటు పెట్టుబడిలో తరచుగా రుణాల రూపంలో విదేశీ ఫైనాన్స్ కంపెనీల వాటా ఉంటోంది. ప్రధాన మంత్రి ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం ద్వారా దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. కానీ మన డబ్బుని సబ్సిడీగా ఇచ్చి విదేశీ కంపెనీల టెక్నాలజీని అరువు తెచ్చుకుని దేశంలో విదేశీ ఉత్పత్తుల తయారీకి అనుమతి ఇవ్వటం అంటే విదేశీ సరుకులకు దేశీయ రంగు కాగితాలు చుట్టి దేశీయ ముద్ర వేసుకోవటమే. దానికి బదులు అదే డబ్బు భారతీయ పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో పెట్టుబడిగా పెట్టి నిజమైన స్వావలంబన సాధించలేమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *