కౌలు రైతుల‌కు త‌క్ష‌ణం గుర్తింపునివ్వాలి

– ఆదిలాబాద్ కౌలు రైతుల స‌మావేశం డిమాండ్‌
– పాల్గొన్న ప‌ది మండ‌లాల కౌలు రైతులు
– కౌలు రైతుల‌కు న్యాయం చేస్తాం: ఖ‌నాపూర్ ఎమ్మెల్యే బొజ్జు హామీ
– క‌లెక్ట‌ర్‌తో చ‌ర్చించిన రైతు సంఘం నాయ‌కులు
ఆదిలాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 29: తెలంగాణలో 36 శాతం పైగా ఉన్న కౌలు రైతులు పంటల ఉత్పతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ రైతులకు అందే సౌకర్యాలు కౌలు రైతులకు అందడంద‌ని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్ మరియు కొండల్ రెడ్డి అన్నారు. బుధ‌వారం “తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ” ఆధ్వర్యంలో ఆదిలాబాదు పట్టణంలో పీఆర్‌టీయూ భవన్ లో జ‌రిగిన  జిల్లా కౌలు రైతుల సమావేశంలో వారు ప్ర‌సంగించారు.  ప్రభుత్వం నుండి గుర్తింపు లేకపోవడం వలన సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, పంట నష్టపరిహారం, రైతు బీమా – ఆఖరికి తమ పంటను ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్ముకునే అవకాశం కూడా కౌలు రైతులకు లభించట్లేద‌న్నారు.  ప్రభుత్వం నిర్లక్షం వల్లనే కౌలు రైతుల ఆత్మ హత్యల పరంపర కొనసాగుతున్నది. అందుకనే రాష్ట్రవ్యాప్తంగా “తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ” అనేక ప్రజా సంఘాలు, ప్రముఖులతో ఏర్పడి ఈ విషయంలో విస్తృత ప్రచారం చేసి ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నదన్నారు. ఇటీవల కౌలు రైతుల పరిస్థితి పై సాధన కమిటీ 22 జిల్లాలు, 47 మండలాలు, 58 గ్రామాలలో 1816 మంది కౌలు రైతులను ప్రత్యక్షంగా కలిసి రాష్ట్ర వ్యాప్త సర్వే నిర్వహించగా, దానిలో వెల్లడి అయిన ముఖ్యాంశాలను కొండల్ రెడ్డి వివరించారు. కౌలు రైతుల సర్వే నివేదిక తయారు చేసి ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సదస్సులు నిర్వహించి రాష్ట్రస్థాయి అధికారులు ప్రజా సంఘాలు వ్యవసాయ అనుబంధ రంగాల వారికి సమర్పించామ‌న్నారు. బోథ్, నేరడిగొండ, తలమడుగు, తాంసీ, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్, బేలా, సాత్నాల, బోరజ్, గుడిహత్నూర్ నుండి కౌలు రైతులు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. కార్య‌క్ర‌మంలో కౌలు రైతుల సాధన కమిటీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, కౌలు రైతులు, ప్రజా సంఘాల నాయకులు మరియు ఖానాపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి సాధన కమిటీ తరఫున రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్ కుమార్, బి.కొండల్ రెడ్డి, టి. శ్రీహర్ష తో బాటు మహిత, ప్రణీత హాజరు అయ్యారు. ఆదిలాబాదు జిల్లా సాధన కమిటీ తరఫున ఎం.రమాకాంత్ స్వాగతం చెప్పి పరిచయం చేయగా, సంగెపు బొర్రన్న సమావేశాన్ని నిర్వహించారు. కౌలు రైతులతో కూడిన జిల్లా కమిటీలో సభ్యులుగా ఏ.రాకేశ్, షారూఖ్, గెల్ల మల్లేష్, బింగి తిరుపతి, సాయి చైతన్య, మొండెల రాజేందర్, కట్ల కుమారస్వామి, పి.సంతోష్, టి.పోశెట్టి, రాసం నర్సింహు, కోడె ప్రమోద్ ప్రకటించారు. తెలంగాణ రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ, అఖిల పక్ష రైతు సంఘం నాయకులు కొండ రమేష్, పోశెట్టి, దళిత శక్తి ప్రోగ్రామ్ (డీ.ఎస్.పీ.) రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల గణేష్, జిల్లా ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ శశికాంత్, రైతు పోరు యాత్ర నాయకులు విద్యాసాగర్, రిటైర్డ్ వ్యవసాయ అధికారి నర్సింగరావు పాల్గొని కౌలు రైతుల డిమాండ్లకు సంఘీభావం ప్రకటించారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *