తాజా సర్వేలో బీఆర్ఎస్కు 38 శాతం, కాంగ్రెస్‌కు 34 శాతం వోటింగ్
ఖైరతాబాద్, ప్రజా తంత్ర, నవంబర్ 26 : తెలంగాణలో రాజకీయ పార్టీల బలాబలాలు, ప్రభుత్వ పనితీరు, ప్రజాభిప్రాయంపై నిర్వహించిన తాజా సర్వేలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు వెల్లడైంది. సర్వే ప్రకారం బీఆర్ఎస్కు 38 శాతం వోటింగ్‌తో 62 అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్‌కు 34 శాతం వోటింగ్‌తో 42 స్థానాలు వొచ్చే అవకాశాలున్నాయని ఓమార్గ్ సర్వే సంస్థ ప్రతినిధులు ఆర్. చెన్నయ్య (సీఈఓ), ప్రకాశ్‌రావు (అనలిస్ట్) తెలిపారు. బీజేపీకి ఎనిమిది, ఎంఐఎంకు ఏడు స్థానాలు వొస్తాయని అంచనా వేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓమార్గ్ సర్వే ప్రతినిధులు మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని తెలిపారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనపడిన బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటోందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మద్దతు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించారు. కులాల వారీగా రెడ్డి సామాజికవర్గంలో కాంగ్రెస్‌కు మద్దతు ఉండగా, ఎస్సీ మాల వర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ కనిపిస్తోందన్నారు. ఇతర బీసీ, సామాజిక, వృత్తి వర్గాల్లో బీఆర్ఎస్ ఒకటి నుంచి ఐదు శాతం వరకు ఆధిక్యంలో ఉందని పేర్కొన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేలో కొన్ని చోట్ల హోరాహోరీ పోటీ ఉండగా, సిద్దిపేట, సిరిసిల్ల వంటి నియోజకవర్గాల్లో బలమైన ఆధిక్యం కనిపించిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వానికి రాబోయే రెండేళ్లు కీలకమని, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని మూడు ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నామని, త్వరలో ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుత సర్వే ఫలితాలు ఇప్పటి పరిస్థితులకు సంబంధించిన అంచనాలు మాత్రమేనని, ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు మారవచ్చని స్పష్టం చేశారు.





