గ్రామీణాభివృద్థి పథకాల్లో తెలంగాణ వెనుకబాటు

– కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కీలక వ్యాఖ్యలు

న్యూదిల్లీ, జూన్‌ 29: ‌గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబడి ఉందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా పథకాల అమలును పరిశీలించినప్పుడు ఇది కనిపించిందన్నారు. న్యూదిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ అధ్యక్షతన సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి 27 రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రం గురించి ఆయన మాట్లాడుతూ పీఎంజీఏసీవై రహదారుల పనులు వేగవంతం కావాలని చెప్పారు. పెండింగ్‌ ‌రహదారి పనులు పూర్తి చేయాలని సూచించారు. పీఎం ఆవాస్‌ ‌సర్వే త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రాణాభివృద్ధి శాఖలో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామాల అభివృద్ధే వికసిత్‌ ‌భారత్‌కు పునాది కావాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. జులై 1వ తేదీ నుంచి వికసిత్‌ ‌భారత్‌ ‌గ్రామీణ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిధుల వాటా సమయానికి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి కోరారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో ముందంజలో ఉందంటూ ఆంధప్రదేశ్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. వీబీజీఆర్‌ఎంఏజీఐకి నోటిఫికేషన్‌ ‌పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉందన్నారు. జులై 2న తిరుపతిలో వీబీజీఆర్‌ఎంఏజీఐ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ జాతీయ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేశామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజన నాణ్యతలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీకి స్థానం దక్కిందని మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌పేర్కొన్నారు.

కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి : సీతక్క స్పష్టీకరణ

కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి పథకాలకు సంబంధించి తీసుకువస్తున్న సరికొత్త విధానాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీబీ జీ రామ్‌ ‌జీ పథకంపై అభ్యంతరాలను కేంద్రానికి మంత్రి సీతక్క తెలియజేశారు. జులై 2న వీబీ జీ రామ్‌ ‌జీపై త‌మ కేబినెట్‌ ‌తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వీబీ జీ రామ్‌ ‌జీని కొనసాగించాలా లేక ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టాలా అనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. వీబీ జీ రామ్‌ ‌జీ పథకం 60:40 నిధుల విధానంపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం పెడితే కేంద్రం నిధులు ఇవ్వదని, 100శాతం ఆర్థిక భారం రాష్ట్రంపై పడుతోందని వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌కు పలు కీలక సమస్యలు, నిధుల విడుదల అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ’వికసిత్‌ ‌గ్రామాలు-2047’ అనే గొప్ప ఆశయం నెరవేరాలన్నా, గ్రామీణ ప్రాంతాలు స్వయంసమృద్ధి సాధించాలన్నా రాష్ట్రాలపై కేంద్రం అదనపు ఆర్థిక భారం మోపకూడదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన విబిజి రామ్‌ ‌లో ప్రవేశపెడుతున్న 60:40 నిధుల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నూతన ఆర్థిక సకరణ వల్ల రాష్ట్రాలపై ఊహించని రీతిలో భారీ ఆర్థిక భారం పడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జూలై 2న జరగబోయే రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశంలో ఈ నిబంధనలపై ఒక తుది నిర్ణయం తీసుకోనున్న‌ట్లు వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రాణ ఉపాధి హామీ పథకంలో గతంలో ఉన్నట్లుగానే 100 శాతం వేతనాల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ ‌చేశారు. మెటీరియల్‌ ‌కాంపోనెంట్‌కు సంబంధించి కూడా గతంలో ఉన్న 75 శాతం కేంద్ర వాటాను అలాగే ఉంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కేంద్ర నిధులు కోల్పోకుండానే, రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిస్థాయిలో కాపాడేలా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గ్రామ్‌ ‌సడక్‌ ‌యోజన కింద రాష్ట్రంలో చేపట్టే గ్రాణ రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ప్రధాన అడ్డంకిగా మారాయని మంత్రి సీతక్క కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ‌ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లమల అటవీ ప్రాంతాల్లో అనేక రోడ్డు పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రోడ్లే కాక ఏజెన్సీ ప్రాంతాల్లోని పేదలకు ఇళ్లు, బోర్‌వెల్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు కూడా అర్దాంతరంగా ఆగిపోయాయని వివరించారు. ఈ క్లియరెన్స్ ‌పక్రియను వేగవంతం చేయడంతోపాటు, రాష్టన్రికి రావాల్సిన పీఎం ఆవాస్‌ ‌యోజన గృహాల కేటాయింపులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు మందగిస్తున్నాయని, రాష్ట్రంలో అధికారుల తరచూ బదిలీల వల్ల కూడా కేంద్రానికి నివేదికలు సమర్పించడంలో కొంత ఆలస్యం జరిగిందని అంగీకరించారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ గ్రాణాభివృద్ధిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోందని మంత్రి సీతక్క గర్వంగా ప్రకటించారు. జల్‌ ‌సంచార్‌ ‌విభాగంలో రాష్టాన్రికి ఏకంగా 13 జాతీయ అవార్డులు రావడం తమ ప్రభుత్వ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనమన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా 100 రోజుల ఉపాధి కల్పనను అమలు చేయడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తేనే గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా సాధ్యమవుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. 100 రోజుల ఉపాధి కల్పనలో తెలంగాణ.. దేశంలో రెండో స్థానంలో ఉందని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వద్దనడంతో పీఎం ఆవాస్‌ ‌గృహాల కేటాయింపులు లేవని., ఇప్పుడు వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందన్నారు. తెలంగాణ నుంచి పన్నుల వాటా తీసుకుంటున్నప్పుడు కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయాలని తెలిపారు. కేంద్ర మంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌కు అటవీ క్లియరెన్స్‌పై వినతిపత్రం అందజేసినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో కూడా జాప్యం జరుగుతోందన్నారు. తరచూ అధికారుల బదిలీలతో నివేదికల సమర్పణలో ఆలస్యం జరిగిందని అన్నారు.

తెలంగాణ వాదనలను బలంగా వినిపించిన సీతక్క

వీబీజీ రాం జీ పథకం చట్టంపై తెలంగాణ వాదనలను మంత్రి సీతక్క బలంగా వినిపించారు. తెలంగాణ చేసిన సూచనలు, లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్, ప్లాంటేషన్, రాష్ట్రాలు కోరుకున్న విధంగా ఉపాధి హామీలో భాగంగా పనులు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని సీతక్క గట్టిగా కోరారు. ఆ మేరకు కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు, చట్టంలో పలు మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *