-ఉద్యమ నాయకులు పందుల సైదులు
– అమరుల త్యాగాలను స్మరిస్తూ స్మృతి దీపం
నల్గొండ, ప్రజాతంత్ర, జూన్ 1: అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని, వారి త్యాగాలను నిరంతరం కొనియాడాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పుష్కరకాలం పూర్తవుతున్న సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పౌర సమాజ సంస్థలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేసి అమరుల స్మృతి దీపం పేరిట వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు పందుల సైదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వివిధ దశల్లో పనిచేసిన ఉద్యమ శక్తులు సంయుక్తంగా అమరుల స్మృతి దీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. తెలంగాణ చరిత్రలో అమరవీరుల త్యాగాలు శాశ్వతంగా నిలిచిపోతాయని, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉద్యమకారులుగా తమపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు ప్రస్తుతం ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలను దాటినప్పటికీ ఆభివృద్ధి ఫలాలు సాధారణ ప్రజలకు సమానంగా అందడం లేదన్నారు. అభివృద్ధి పేరుతో హైదరాబాద్ నగరానికే ప్రాధాన్యత ఇస్తూ, మిగతా జిల్లాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి ఆందోళన కలిగిస్తోందన్నారు.తెలంగాణ ఉద్యమం లక్ష్యం కేవలం ఒక నగర అభివృద్ధి కాదని,రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా సమానంగా అభివృద్ధి చెందడమేనని స్పష్టం చేశారు.వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, సామాజిక సంక్షేమ రంగాలలో సమగ్ర అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం, ప్రభుత్వ విద్యా మరియు వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అంటే,వారు కలలుగన్న తెలంగాణ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు బోనగిరి దేవేందర్,చీర పంకజ్ యాదవ్,,దూసరి కిరణ్ కుమార్, చింతమల్ల గురువయ్య, కే.పర్వతాలు,ఇందూరి సాగర్,ఆర్.విజయ్ కుమార్, పి.ఏడుకొండలు, మల్లేశం ఆర్ లక్ష్మయ్య,పెండెం ధనుంజయ నేత, వెంకటేశ్వర్లు,బీవీ చారి, గద్దపాటి సురేందర్, కే.రత్నయ్య, సునీత,గూడూరి జానకిరామ్ రెడ్డి, అయితగోని జనార్దన్ గౌడ్, మాతంగి అమర్, బట్టు నవీన్, కొండేటి మురళి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





