– యంగ్ ఇండియా స్కూల్ కోసం ఏకమైన నేతలు
– పార్టీల కంటే ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట
– కొండపాకలో రాజకీయాలకు అతీతంగా ఐక్యతారా
– పాఠశాల తరలింపును అడ్డుకునేందుకు ఆందోళన
– నాయకుల ఐక్యతకు ప్రజల ప్రశంసలు
సిద్దిపేట ప్రజాతంత్ర, జూలై 17: రాజకీయాల్లో భేదాభిప్రాయాలు సహజం.. ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు కూడా సహజమే. కానీ ప్రజల అవసరం ముందు పార్టీలు, జెండాలు, ఎజెండాలు, సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టి ఒక్కటిగా నిలబడటం అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి అరుదైన ఐక్యతకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వేదికైంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నాయకులంతా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒకే వేదికపైకి రావడం స్థానికుల్లో కొత్త ఆశలు నింపుతోంది. 2026 మార్చి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ పాఠశాల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు కొండపాక శివారులో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ విద్యాసంస్థ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే కేంద్రంగా మారుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కొండపాకకు మంజూరైన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థను మరో మండలానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం బయటకు రావడంతో మండల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించి ప్రజల ముందుకు తీసుకొచ్చిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అంబటి బాల్ చందర్ గౌడ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, మండల భవిష్యత్తుకు, వేలాదిమంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయమని పేర్కొంటూ పార్టీలకతీతంగా ఒక్కటిగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు.
కదలివచ్చిన నాయకులు, ప్రజాసంఘాలు
ఆ పిలుపునకు ఊహించిన దానికంటే గొప్ప స్పందన లభించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, యువకులు ఒకే వేదికపైకి వచ్చి అఖిలపక్షంగా ఏకమయ్యారు. కొండపాక నుంచి యంగ్ ఇండియా పాఠశాలను తరలించవద్దని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి మండల ప్రజల ఆకాంక్షలను వివరించారు. ఈ పరిణామం కొండపాక ప్రజల్లో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చింది. ప్రజా అవసరాల కోసం నాయకులు ఇలా ఒక్కటైతే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.. ఇదే నిజమైన ప్రజాప్రతినిధుల బాధ్యత అని చర్చించుకుంటున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కేవలం ఒక భవనం కాదు.. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును మార్చే అవకాశాల నిలయం. అలాంటి విద్యాసంస్థ కొండపాకలోనే కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





