విధ్వంసకర పాలనలో పెట్టుబడులు వొస్తాయా?

“గ్లోబల్‌ సమ్మిట్‌కు ముందు మెటా కార్యాలయం చుట్టూ తలెత్తిన వివాదం తెలంగాణకు ప్రతికూల సంకేతం. వొచ్చే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లోనూ రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకునే సంస్థలు ప్రభుత్వ స్పందనను గమనిస్తాయి. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు విస్తరణ నిర్ణయాలను వాయిదా వేసినా, ఇతర రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయాలను పరిశీలించినా దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుంది. హైదరాబాద్‌ ప్రతిష్ఠను నిలబెట్టే బాధ్యత ప్రభుత్వానిదే. విచారణ వివరాలను వెల్లడించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం, పెట్టుబడుల అమలు లెక్కలు చూపడం ద్వారా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి..”

శంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగ హక్కులను బీజేపీ హరిస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, డిజిటల్‌ వేదికలపై దాడులు జరుగుతున్నాయని దేశవిదేశాల్లో ప్రశ్నిస్తున్నారు. ద్వేషాన్ని ప్రేమతో, హింసను అహింసతో ఎదుర్కొంటామని చెబుతున్నారు. ప్రజల మాట వింటూ ముందుకు సాగుతామని హామీ ఇస్తున్నారు. ఈ మాటలకు తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన అద్దం పట్టాలి. హైదరాబాద్‌లో మెటా కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేశాయన్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ మౌనం ఆ మాటల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది.

రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్‌ గాంధీకి సొంత పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కనిపించడం లేదా? మోదీ పాలనను నియంతృత్వంతో పోల్చే ఆయన, హైడ్రా విషయంలో హిట్లర్‌ స్ఫూర్తిని ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని మావోయిస్టులు పేల్చేయాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపైనా కాంగ్రెస్‌ నాయకత్వం తన వైఖరి చెప్పాలి. ‘ద్వేషపు బజారులో ప్రేమ దుకాణం’ అన్న రాహుల్‌ నినాదానికి విలువ ఉండాలంటే సొంత పార్టీ నేతల మాటలనూ, చర్యలనూ అదే ప్రమాణంతో చూడాలి.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ శిలాఫలకాన్ని లక్ష్యంగా చేసుకున్న ఘటనపై విమర్శలు వచ్చాయి. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌, భువనగిరి, నల్లగొండ, కరీంనగర్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతల కార్యాలయాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రశ్నించే జర్నలిస్టులు, పౌర సంఘాల ప్రతినిధుల ఇళ్లపైనా దాడులు జరిగాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి ఘటనల్లో బాధ్యులపై ఏ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం వెల్లడించాలి. అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరే ప్రజాస్వామ్య హక్కుల పట్ల దాని చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.

ఇప్పుడు చర్చ హైదరాబాద్‌లోని మెటా కార్యాలయానికి చేరింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజర్‌, థ్రెడ్స్‌ వంటి వేదికలను నిర్వహించే మెటా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దానితో వ్యాపార సంబంధాలున్న సంస్థలూ ఎన్నో ఉన్నాయి. అలాంటి సంస్థ కార్యాలయంలోకి అధికార పార్టీ నేతలు చొరబడి విధ్వంసం సృష్టించారన్న ఆరోపణలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోగలదా? అక్కడ ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అధికార పార్టీ ప్రమేయం తేలితే, సంబంధిత నేతలపై కాంగ్రెస్‌ కూడా చర్యలు తీసుకోవాలి.

పెట్టుబడిదారులు ఒక నగరాన్ని ఎంచుకునేటప్పుడు భూమి, రాయితీలు, మౌలిక సదుపాయాలతో పాటు తమ ఉద్యోగుల భద్రతను, కార్యకలాపాల స్థిరత్వాన్ని పరిశీలిస్తారు. వివాదం తలెత్తితే ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తుందా, రాజకీయ ఒత్తిళ్ల నుంచి రక్షణ లభిస్తుందా అన్నదీ వారికి ముఖ్యం. మెటా ఘటనపై ప్రభుత్వం విశ్వసనీయంగా స్పందించకపోతే, హైదరాబాద్‌లో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకూ, కొత్తగా రావాలనుకుంటున్న కంపెనీలకూ సందేహాలు కలుగుతాయి. దాని ప్రభావం విస్తరణ నిర్ణయాల మీద, స్థానిక సరఫరాదారుల వ్యాపారం మీద, చివరకు తెలంగాణ యువత ఉద్యోగావకాశాల మీద పడుతుంది.

కృత్రిమ మేధ విస్తరణతో సాంకేతిక రంగంలో పనితీరు మారుతోంది. పలు కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్న తరుణంలో కొత్త అవకాశాల కోసం తెలంగాణ యువత ఎదురుచూస్తోంది. ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది? కొత్త సంస్థలను ఆకర్షించేందుకు రంగాలవారీగా ఏ ప్రణాళిక ఉంది? విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలపై పరిశ్రమలు లేవనెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తోంది? ఈ ప్రశ్నలకు విధానపరమైన సమాధానాలు కావాలి. పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్న సమయంలో రాజకీయ వివాదాలు కంపెనీల రోజువారీ కార్యకలాపాల్లోకి చొరబడితే ఆ మూల్యం నిరుద్యోగ యువతే చెల్లించాల్సి వస్తుంది.

హైడ్రా చర్యల తీరుపైనా ఇదే ప్రశ్న తలెత్తుతోంది. కూల్చివేతల వల్ల నిర్మాణ రంగంతో పాటు దానిపై ఆధారపడిన సేవా సంస్థలు, కార్మికులు దెబ్బతిన్నారన్న విమర్శలను ప్రభుత్వం పట్టించుకోవాలి. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో నిబంధనలు ఎలా అమలు చేస్తున్నారో, నిర్ణయాలకు ప్రాతిపదిక ఏమిటో ప్రజలకు తెలియాలి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ‘దివాళా’గా అభివర్ణిస్తూ, మరోవైపు హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యంగా ప్రచారం చేస్తే పెట్టుబడిదారులకు ఎలాంటి సందేశం వెళ్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పరిశ్రమలకు ఇచ్చే హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.

మేడిగడ్డ వ్యవహారంలో ఎల్‌ అండ్‌ టీ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా చర్చకు వచ్చింది. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాల ఉన్నతాధికారిని అరెస్టు చేయాలంటూ రేవంత్‌రెడ్డి దిల్లీలో చేసిన వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఎలాంటి అభిప్రాయం కలిగిస్తాయో ఆలోచించాలి. ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టులో లోపాలుంటే విచారణ జరగాలి. నిర్మాణ సంస్థ బాధ్యతను ఒప్పందాలు, సాంకేతిక నివేదికలు, చట్ట ప్రకారం నిర్ధారించాలి. విచారణలో తేలాల్సిన విషయాలపై ప్రభుత్వ పెద్దలు ముందుగానే శిక్షల గురించి మాట్లాడితే, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే సంస్థలు తమకు న్యాయమైన విచారణ లభిస్తుందా అని ప్రశ్నిస్తాయి.

ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలోనూ ఆ ప్రశ్నే ఎదురవుతోంది. కేటీఆర్‌పై రాజకీయ కక్షతో యూకేకు చెందిన రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈఓను ఇబ్బందులకు గురిచేశారన్న విమర్శ ఉంది. ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయా, చెల్లింపుల్లో నిబంధనలు పాటించారా అన్నది ఆధారాలతో తేల్చాలి. అదే సమయంలో తెలంగాణను విద్యుత్‌ వాహనాల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపిందో ప్రభుత్వం వివరించాలి. ప్రభుత్వాలు మారినప్పుడు గత ఒప్పందాలను సమీక్షించే పద్ధతి పారదర్శకంగా ఉంటేనే దీర్ఘకాలిక పెట్టుబడులకు అవసరమైన నమ్మకం ఏర్పడుతుంది.

గ్లోబల్‌ సమ్మిట్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమావేశాల్లో కుదిరిన అవగాహన ఒప్పందాల విలువను ప్రభుత్వం గొప్పగా ప్రకటిస్తోంది. గత మూడేళ్లలో ప్రకటించిన పెట్టుబడుల్లో వాస్తవంగా ఎంత మొత్తం రాష్ట్రానికి వచ్చింది? ఎన్ని ప్రాజెక్టులకు భూములు కేటాయించారు? ఎన్ని సంస్థలు నిర్మాణం మొదలుపెట్టాయి? ఎన్ని యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించాయి? స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు లభించాయి? ఒప్పందాల వారీగా ఈ వివరాలు వెల్లడిస్తేనే సదస్సుల ఫలితం తెలుస్తుంది. ఏ కంపెనీకి ఎంత ప్రభుత్వ భూమి, ఏ ధరకు, ఏ షరతులతో కేటాయించారో వెల్లడిస్తే ఆశ్రితులకు భూములు కట్టబెడుతున్నారన్న ఆరోపణలకూ ప్రభుత్వం సమాధానం చెప్పగలదు.

తెలంగాణకు చెందిన నీటి వాటా ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతోందన్న విమర్శలు, రాష్ట్ర నిధుల వినియోగంపై ప్రశ్నలు, కరువు పరిస్థితులు, విద్యుత్‌ సరఫరాపై ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్‌, రవాణా సదుపాయాలపై స్పష్టమైన ప్రణాళిక లేకపోతే కొత్త ఒప్పందాలు అమలులోకి రావడం కష్టమవుతుంది. ముఖ్యంగా డేటా కేంద్రాలకు నిరంతర విద్యుత్‌ అవసరం. నిర్మాణ రంగంపై ఆధారపడిన చిన్న వ్యాపారాలకు స్థిరమైన అనుమతుల విధానం అవసరం. పెట్టుబడుల సదస్సులో ఇచ్చే హామీలకు ఈ రంగాల్లో ప్రభుత్వ రోజువారీ పనితీరు ఎంతవరకు సరిపోతుందో లెక్క తేలాలి.

గ్లోబల్‌ సమ్మిట్‌కు ముందు మెటా కార్యాలయం చుట్టూ తలెత్తిన వివాదం తెలంగాణకు ప్రతికూల సంకేతం. వచ్చే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లోనూ రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకునే సంస్థలు ప్రభుత్వ స్పందనను గమనిస్తాయి. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు విస్తరణ నిర్ణయాలను వాయిదా వేసినా, ఇతర రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయాలను పరిశీలించినా దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుంది. హైదరాబాద్‌ ప్రతిష్ఠను నిలబెట్టే బాధ్యత ప్రభుత్వానిదే. విచారణ వివరాలను వెల్లడించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం, పెట్టుబడుల అమలు లెక్కలు చూపడం ద్వారా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి.

రాహుల్‌ గాంధీకి తెలంగాణ నుంచి ఎదురవుతున్న ప్రశ్న సూటిగా ఉంది. దిల్లీలో మీడియా సంస్థపైనా, కార్పొరేట్‌ కార్యాలయంపైనా దాడి జరిగితే నిలదీసే మీరు, హైదరాబాద్‌లో సొంత పార్టీ శ్రేణులపై వచ్చిన ఆరోపణలకు ఎందుకు స్పందించరు? మీ పార్టీ పాలించే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులకు, ప్రతిపక్ష కార్యాలయాలకు, వ్యాపార సంస్థలకు రక్షణ కల్పించే బాధ్యతను ఎప్పుడు గుర్తు చేస్తారు? ‘ప్రేమ దుకాణం’ నినాదానికి తెలంగాణలో అర్థం రావాలంటే ఆ సమాధానం కాంగ్రెస్‌ ఆచరణలో కనిపించాలి. రాష్ట్రానికి పెట్టుబడులు కావాలంటే, ప్రభుత్వం ముందు తన పాలనపై నమ్మకం కలిగించాలి.

-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *