క్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ఫోకస్

– క్రిటికల్ మినరల్స్ పరిశోధనకు త్రిముఖ భాగస్వామ్యం
– మోనాష్-ఐఐటీ హైదరాబాద్-సింగరేణి సంయుక్తంగా ముందడుగు
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : క్రిటికల్ మినరల్స్, ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతల రంగాల్లో దీర్ఘకాలిక పరిశోధన, సంస్థాగత భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మోనాష్ యూనివర్సిటీ డీన్, ఇతర ఉన్నతాధికారులతో మహాత్మా జ్యోతిరాపు ఫూలే ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధనను వేగవంతం చేయడంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరిస్తున్న తరుణంలో క్రిటికల్ మినరల్స్ ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. తెలంగాణ వీటికి వినియోగదారుగా మాత్రమే ఉండకూడదని, మొత్తం విలువ శృంఖలిలో కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. అకడమిక్ భాగస్వామ్యాన్ని కేవలం పరిశోధనకే పరిమితం చేయకుండా వాణిజ్య స్థాయిలో విస్తరించగల సాంకేతికతల అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన కార్యాచరణను త్వరగా రూపొందించాలని అధికారులను కోరారు. తెలంగాణను క్రిటికల్ మినరల్స్ పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి వేదికగా మలచాలని చెప్పారు. మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి సంస్థలను సమన్వయం చేయడం ద్వారా ఖనిజాల అన్వేషణ, మినరల్స్ వెలికితీత, శుద్ధి సాంకేతికతలు, వ్యర్థాల నుంచి క్రిటికల్ మినరల్స్‌ను తిరిగి పొందే విధానాలపై దృష్టిపెట్టాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలు, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కొరతను అధిగమించడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని చెప్పారు. సమావేశంలో డీప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, మోనాష్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ యాయిన్నిస్ వెంటికోస్, ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ మోహన్ ఎల్లిషెట్టి, ప్రొఫెసర్ రామన్ సింగ్, సింగరేణి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *