– కారుణ్య నియామకాలు జరిపాం
– వాహన్ సారథి తీసుకొచ్చాం
– వెయ్యి రోజుల పాలనపై రవాణా శాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని, తమ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటివరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయగా వారు రూ.12,167 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతోపాటు సంస్థ ప్రగతిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా బస్ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ, రవాణా శాఖ విజయాలు, ప్రగతి గురించి వివరించారు. దేశంలో మొదటిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. ప్రతి బస్సుకు రూ.69,468లు, నెలకు రూ.4 కోట్లు ఈఎంఐ చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.29.31 కోట్లు చెల్లించామని చెప్పారు. గతంలో ఆక్యుపెన్సీ 67 శాతం ఉంటే ఇప్పుడు 89 శాతం పెరిగిందన్నారు.
ఈవీ బస్సులు, నియామకాలు
సర్వీసు నుండి తొలగింపునకు గురైన దాదాపు 244మంది ఉద్యోగులను ప్రత్యేక ఐఏఎస్ కమిటీ ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకున్నామని, 1,424 కారుణ్య నియామకాలు చేపట్టామని చెప్పారు. 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని, పీఎం డ్రైవ్ కింద హైదరాబాద్‌లో 1,024 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని, నగరంలో మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయని చెప్పారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ సమన్వయంతో లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ అమలు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ టిమ్‌ల ద్వారా టికెట్ జారీ చేస్తున్నామన్నారు. తార్నాక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి చేశామని, ఆర్టీసీ శ్రామికులకు రెండు పీఆర్సీలు ఇచ్చామని, 5 డీఏలు ఇచ్చామని, డీఏలు పెండింగ్‌లో లేవని వివరించారు. యూనియన్ ఎన్నికలు జరుపుతున్నామని, తరువాత విలీనం ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. బస్ స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని, పెద్దపల్లి, ఏటూరునాగారం డిపోలు ఇచ్చామని, సీసీఎస్ బకాయిలు రూ.1096 కోట్ల నుండి రూ.939 కోట్లకు తగ్గించామని, పీఎఫ్ బకాయిలు రూ.2108 కోట్ల నుండి రూ.1710 కోట్లకు తగ్గించామని, ఎసఆర్బీఎస్, ఎస్బీటీ బకాయిలు రూ.513 కోట్ల నుండి రూ.485 కోట్లకు తగ్గించినట్లు వివరించారు. 4,538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, వెయ్యి డ్రైవర్, 743 శ్రామిక పోస్టుల నియామకాలు పూర్తయ్యాయని, వచ్చే నెలలో నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. 1500 కండక్టర్ నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఎక్కడా పొరపాటు జరగకుండా పారదర్శకంగా పోలీస్ శాఖ ద్వారా నియామకాలు చేపట్టామని చెప్పారు. 240 డీజిల్ బస్సులు రిటైర్ఫిట్మెంట్ చేస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాలకు బస్ స్టేషన్లు ఆధునికీకరిస్తున్నామని, భక్తుల రద్దీకి తగ్గట్టు బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కొత్త రూట్లు అడిగితే బస్సులు వేస్తున్నామని, హైదరాబాద్‌లో 370 కొత్త రూట్లలో నడిపిస్తున్నామని, గ్రామాల్లో కూడా బస్ రూట్లు లేని ప్రాంతాల్లో బస్సులు నడిపిస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు. దేశంలో నంబర్ 1గా ఆర్టీసీ ఎదుగుతుందన్నారు. ప్రతి నెలా మంగళవారం కార్మికుల గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని, వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని, రోడ్ సేఫ్టీ సెస్ రోడ్డు భద్రతకు ఉపయోగించుకునేలా చట్టం చేసుకుని ముందుకు పోతున్నామని తెలిపారు. నగరంలో కొన్ని రూట్లలో నైట్ బస్సులు నడుస్తున్నాయని మంత్రి పొన్నం చెప్పారు.
ఈవీ పాలసీ
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తెచ్చామని, రూ.1400 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చామని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో ఆటోలను రిటైర్ఫిట్మెంట్ చేయడానికి ప్రభుత్వం రూ.1.50 లక్షలు సహాయం అందిస్తుందన్నారు. రవాణా శాఖ చెక్‌పోస్టులు ఎత్తివేసిందని, జిల్లాలో ఎన్ఫోర్సుమెంట్ టీంలు పెంచామని, టీఎస్‌ను టీజీగా మార్చుకున్నామని చెప్పారు. వాహన అండ్ సారథి తీసుకొచ్చామని, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనలతో వాహన సారథిలో చేరామన్నారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులు ప్రారంభిస్తున్నామన్నారు. రవాణా శాఖలో 113 ఏఎంవీఐలు, 50 మంది కానిస్టేబుల్, 20 మంది జూనియర్ అసిస్టెంట్, నలుగురు ఎంవీఐలను నియమించామని, రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అరైవ్ అలైవ్ పేరుతో పోలీస్ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, రహవీర్ స్కీమ్ అమలు చేస్తున్నామని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





