– మేడ్చల్ జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల
– లబ్దిదారులకు మహిళా యోజన చెక్కుల పంపిణీ
మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : మైనారిటీ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా బలపడేందుకు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా పొందే ఆర్థిక సహాయం ఎంతగానో దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హజ్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ముజుబుద్దీన్, మైనారిటీ ఫైనాన్స్ చైర్మన్ ఒబెదుల్ల కొత్వాల్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అని తెలిపారు. స్వయం ఉపాధి, చిన్న వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగగలరన్నారు. ఈ పథకం కింద మేడ్చల్ జిల్లాలో 225 మంది మైనారిటీ మహిళా లబ్దిదారులు ఒక్కొక్కరికి రూ.50వేల చెక్కును అందించారు. తుర్క కాశి ముస్లిం వర్గానికి కుల వృత్తికి ఉపయోగపడే రూ.60 వేల విలువ చేసే జనరేటర్ టూల్ కిట్లను 57మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. రేవంత్ అన్నాకా సహారా-మిస్కినో కే లియే పథకం కింద మైనారిటీల జీవనోపాధికి అవసరమైన రూ.లక్ష విలువైన మోపెడ్లను, స్వయం ఉపాది కింద మహిళలకు కుట్టు మిషన్ లు అందజేశారు. మత, సామాజిక, మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సహాయం, విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మహిళలకు ఆర్థిక చేయూత అందించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్టులు జారీ చేసి అందరికీ సన్న బియ్యం అందచేస్తున్నదన్నారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నైపు ణ్యం అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. అనంతరం లబ్దిదారులకు చెక్కుల పంపిణీ, జనరేటర్ అండ్ టూల్ కిట్ అందచేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, ఆర్టియే సభ్యుడు, మున్సిపల్ చైర్‌పర్సన్స్, టీజీఎల్‌డీఏ చైైర్మన్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కాంతమ్మ, ప్రజాప్రతినిలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





